- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎల్‌నీనో ప్రభావం నేపథ్యంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. శనివారం సచివాలయంలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాపై సీతక్క ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2023లోనూ ఇలాంటి పరిస్థితులను విజయవంతంగా ఎదుర్కొన్నామని, ఈసారీ అదే నిబద్ధతను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. వచ్చే 100 రోజులకు సరిపడా తాగునీటి నిల్వలు ఉన్నాయని అధికారులు మంత్రికి తెలిపారు. సింగూరు, పాలేరు వంటి రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గినప్పటికీ, తాగునీటి సమస్య తలెత్తకుండా కార్యాచరణ రూపొందించామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాలకు సాధారణ స్థాయిలో తాగునీటి సరఫరా కొనసాగుతుండటం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. మండలాల వారీగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. మిషన్ భగీరథకు ఇంకా అనుసంధానం కాని ఆదివాసీ, గిరిజన గ్రామాలను ఏఈలు వారం రోజుల్లో సందర్శించి, ప్రత్యామ్నాయ కార్యాచరణను సిద్ధం చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు.
త్వరలో హ్యామ్ రోడ్ల పనులు ప్రారంభం..
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని సీతక్క తెలిపారు. అందుకోసం అత్యాధునిక హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్పారు. సచివాలయంలో శనివారం గ్రామీణ హ్యామ్ రోడ్ల నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడూ.. ప్రతి గ్రామానికి నాణ్యమైన రోడ్డు కనెక్టివిటీ ఉండాలనేది ప్రభుత్వ ఆకాంక్ష అని వెల్లడించారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా హ్యామ్ మోడల్‌లో మొత్తంగా 6,703 గ్రామాల్లో 18,472 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. మొదటి విడత కింద 2,678 గ్రామాల్లో 7,450 కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణ, పునర్నిర్మాణ పనులు చేపడుతున్నామని వెల్లడించారు. మొదటి విడుతలో 90 శాతం పనులు ప్రస్తుతం ఉన్న రహదారుల ఆధునీకీకరణ పనులకే ప్రధాన్యమిస్తున్నట్టు తెలిపారు. దశాబ్దాలుగా రవాణా సౌకర్యం లేని 179 గ్రామాలకు తొలిసారిగా 934 కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రోడ్లను వేస్తున్నట్లు సీతక్క పేర్కొన్నారు.
లక్ష ఇంకుడు గుంతలే లక్ష్యం..
ఆగస్టు 15వ తేదీలోపు రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ లక్ష్యాన్ని సాధించిన అధికారులు, గ్రామ పంచాయతీలు, ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానిస్తామని తెలిపారు. ఆగస్టు 7వ తేదీ నుంచి జిల్లాల వారీగా స్వయంగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తానని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా అధికారులను బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ప్రతి సోమ, మంగళ, బుధవారాల్లో తప్పనిసరిగా గ్రామసభలు నిర్వహించి, వీబీ జీ రాంజీ పరిధిలో ఉన్న 318 రకాల పనులను గ్రామాల అవసరాలకు అనుగుణంగా గుర్తించి ప్రారంభించాలని ఆదేశించారు. తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని సీతక్క అధికారులకు సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించే ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊటకుంటల నిర్మాణాలు వంటి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.






