- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోమశిల ఆలయానికి త్వరలో కొత్త సొగసులు
మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలోని శ్రీ లలితా సోమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దిశ, కొల్లాపూర్ : తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం సాయంత్రం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలోని శ్రీ లలితా సోమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికి, స్వామివారి సన్నిధిలో వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి ఆలయ పరిసరాలను పరిశీలించి అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సోమశిల ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పురావస్తు శాఖ డీఈ నర్సింగ్ నాయక్ తో సుమారు అరగంటపాటు చర్చించిన మంత్రి, ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు. ప్రస్తుతం సిమెంట్‌తో నిర్మించిన గోపురాన్ని రాతి నిర్మాణంగా తీర్చిదిద్దాలని, ఆలయ ప్రాంగణంలో గ్రానైట్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా భక్తులు స్నానాలు చేసేందుకు ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేసి, మురుగు నీరు నిల్వ లేకుండా డ్రైనేజీ వ్యవస్థ కల్పించాలని సూచించారు. శివలింగాలకు అభిషేకాలు చేసే నీరు బయటకు వెళ్లేందుకు ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ గోవింద్ రెడ్డి, సోమశిల గ్రామ సర్పంచ్ కాటం వెంకటలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు రాంమోహన్, కేతూరి రామకృష్ణ, రెడ్డిగారి కుర్మయ్య, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






