- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఔరా.. కొడంగల్!
తెలంగాణ సామాజిక, ఆర్థిక చిత్రపటంలో ‘కొడంగల్’ సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. నలుమూలలా ఎటు చూసినా.. అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఒకప్పుడు వెనుకబడిన మెట్ట ప్రాంతంగా ఉన్న కొడంగల్.. నేడు అంతర్జాతీయ స్థాయి విద్యా కేంద్రాలకు, మెగా పారిశ్రామిక కారిడార్లకు, రవాణా ఆధారిత అభివృద్దికి కేరాఫ్‌గా మారుతోంది.

దిశ, రంగారెడ్డి బ్యూరో : తెలంగాణ సామాజిక, ఆర్థిక చిత్రపటంలో ‘కొడంగల్’ సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. నలుమూలలా ఎటు చూసినా.. అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఒకప్పుడు వెనుకబడిన మెట్ట ప్రాంతంగా ఉన్న కొడంగల్.. నేడు అంతర్జాతీయ స్థాయి విద్యా కేంద్రాలకు, మెగా పారిశ్రామిక కారిడార్లకు, రవాణా ఆధారిత అభివృద్దికి కేరాఫ్‌గా మారుతోంది. ఈ క్రమంలో స్థానికంగా భూముల ధరలు సైతం పెరిగిపోతున్నాయి. రోజురోజుకు కొంగొత్త రూపు రేఖలను సంతరించుకుంటున్న ఈ ప్రాంతం భవిష్యత్ పెట్టుబడులకు అనువుగా మారుతోందన్న అభిప్రాయాన్ని స్తిరాస్థి రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లతో పోలిస్తే మూడు రెట్లు పెరిగిన భూముల ధరలే ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు.
‘కడా’ ఆధ్వర్యంలో విస్తృత అభివృద్ది
కొడంగల్ అభివృద్దికై ప్రభుత్వం ప్రత్యేకించి కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(కడా)ని ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో నిధుల వరద పారుతుండడంతో మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఎన్నో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. విద్య, వైద్య రంగాలకు సంబంధించి గురుకులాలు, ఆసుపత్రులు, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలకు పక్కా భవనాలను నిర్మిస్తున్నారు. ప్రభుత్వ సంబంధిత కార్యాలయ భవనాలతోపాటు రోడ్లు తదితర మౌళిక వసతులకు సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నారాయణ పేట్ - కొడంగల్ ఎత్తిపోతల పథకం ఈ ప్రాంతానికి వర ప్రదాయినిగా నిలవనున్నది. వేల కోట్లు వెచ్చించి చేపడుతున్న పనుల్లో కొన్ని ప్రారంభ దశలో ఉండగా.. మరికొన్ని వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. భవిష్యత్‌లో ఈ ప్రాంత రూపురేఖలను పూర్తిగా మార్చేయనున్నాయి.
ఎయిర్ పోర్టుకు 45 నిమిషాల్లోనే..
హైదరాబాద్ ఐటీ కారిడార్‌ను, శంషాబాద్ ఎయిర్ పోర్టును కొడంగల్‌తో అనుసంధానించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన రేడియల్ రోడ్-2 పనులు వేగవంతం అయ్యాయి. బుద్వేల్ నుంచి ప్రారంభమై షాబాద్, కొండూరు, పరిగి మీదుగా కొడంగల్ వరకు దాదాపు 81 నుండి 84 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మిస్తున్నారు. 300 అడుగుల వెడల్పుతో ఏకంగా 10 లైన్ల గ్రీన్ ఫీల్డ్ కారిడార్‌గా దీనిని రూపొందిస్తుండటంతో.. భవిష్యత్తులో ఎయిర్ పోర్టు నుంచి కొడంగల్‌కు కేవలం 45 నిమిషాల్లోనే చేరుకునే వెసులుబాటు కలగనుంది.
గోవా ప్రయాణం సులభతరం
వికారాబాద్-కృష్ణా నూతన రైల్వే మార్గంతో దశాబ్దాల నాటి కొడంగల్ ప్రజల రైల్వే కల త్వరలోనే సాకారం కానున్నది. లగచర్ల పారిశ్రామిక వాడను అనుసంధానిస్తూ ఈ ప్రాజెక్టు అలైన్‌మెంట్‌లో కీలక మార్పులు చేశారు. దీనివల్ల నూతన రైల్వే లైన్ పొడవు 130.28 కిలోమీటర్లకు పెరిగింది. సుమారు రూ. 2,784.11 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ రైలు మార్గం.. దౌల్తాబాద్, పరిగి, కొడంగల్, మద్దూర్, బాలంపేట్, అన్నసాగర్, నారాయణపేట్, మక్తల్ మీదుగా కర్ణాటక సరిహద్దును తాకనుంది. గోవాలోని మడ్ గావ్‌కు 35-40 కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశం ఉంది. తాండూరు సిమెంట్ పరిశ్రమల నుంచి సిమెంట్ రవాణా సైతం సులభం అవుతుంది. కొడంగల్ మీదుగా వెళ్లే రెండు ప్రధాన జాతీయ రహదారుల విస్తరణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. హైదరాబాద్-బీజాపూర్(ఎన్‌హెచ్-163) మార్గాన్ని నాలుగు లేన్లుగా విస్తరిస్తుండడంతో కర్ణాటక, మహా రాష్ర్ట సరిహద్దు ప్రాంతాలకు రవాణా సులభతరమవుతోంది. అలాగే రూ.703 కోట్లతో కోస్గి, కొడంగల్ (5 కి.మీ బైపాస్), తాండూరు బైపాస్‌ల మీదుగా నిర్మిస్తున్న భూత్పూర్ - చించోలి(ఎన్‌హెచ్-167)జాతీయ రహదారిని బెంగళూరు-ముంబై జాతీయ రహదారులకు అనుసంధానిస్తున్నారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
దుద్యాల్ మండల పరిధిలోని లగచర్ల వద్ద సుమారు 2000 నుంచి 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కాలుష్య రహిత, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఐటీ, ఫార్మా, గిడ్డంగులు (లాజిస్టిక్స్) మరియు తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. ఈ పారిశ్రామిక వాడ ద్వారా స్థానిక యువతకు వేలాది సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. హకీంపేట్ శివారులోని 248 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంత యువతకు ఉన్నత చదువులతోపాటు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను ఈ హబ్ ద్వారా అందిస్తారు.
రియల్ ఎస్టేట్‌కు ఊతం
కొడంగల్ చుట్టూ జరుగుతున్న అభివృద్ది రియల్ ఎస్టేట్‌కు ఊతం ఇవ్వడంతోపాటు సామాజిక ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. దీంతో అందరి చూపు ఇప్పుడు కొడంగల్‌పై పడింది. ఐటీ ఉద్యోగులు, పెట్టుబడిదారులు ఈ ప్రాంతంలో ఎకరం, అర ఎకరం భూమిని కొనుగోలు చేసి వీకెండ్ హోమ్స్ నిర్మించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇండస్ట్రియల్ కారిడార్, జాతీయ రహదారులు, రేడియల్ రోడ్ తదితర ప్రాంతాల్లో భూములకు ఇప్పుడిప్పుడే డిమాండ్ మరింత పెరుగుతోంది. కొడంగల్-తాండూరు, పరిగి-కొడంగల్ హైవేకు ఇరు వైపులా ఉన్న స్థలాల ధరలు గత రెండేళ్లతో పోలిస్తే దాదాపు 2 నుండి 3 రెట్లు పెరిగాయి. కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో, కొత్త బైపాస్ రోడ్లకు సమీపంలో లే అవుట్లు సైతం వెలుస్తున్నాయి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కాస్త ఢల్‌గానే ఉండగా.. భవిష్యత్తులో మాత్రం మంచి డిమాండ్ వచ్చే ఛాన్స్ ఉందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.






