స్థానిక కాంట్రాక్టర్ల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం

by Jakkula.Mamatha |

బీటీపీఎస్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని కాంట్రాక్టు పనులు మెర్జ్ చేసి, కార్పొరేటీకరణ చేసేందుకు జెన్కో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

స్థానిక కాంట్రాక్టర్ల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం
X

దిశ,మణుగూరు: బీటీపీఎస్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని కాంట్రాక్టు పనులు మెర్జ్ చేసి, కార్పొరేటీకరణ చేసేందుకు జెన్కో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడ పనులు నిర్వహిస్తున్న స్థానిక కాంట్రాక్టర్లకు ఉపాధి లేకుండా పోతుండటం పట్ల స్థానిక కాంట్రాక్టర్లు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ప్రజా భవన్ క్యాంపు కార్యాలయంలో శనివారం కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఎమ్మెల్యేకు తెలిపారు. సమస్యలు విన్న ఎమ్మెల్యే తక్షణమే స్పందించి, జెన్కో డైరెక్టర్(సివిల్, విద్యుత్ సౌధ ) అజయ్ తో చరవాణి లో మాట్లాడారు.

లోకల్ కాంట్రాక్టర్స్ అంతా బీటీపీఎస్ పరిధిలోని ప్రభావిత గ్రామాలకు చెందినవారని, రెండు పంటలు పండే భూములను బీటీపీఎస్ నిర్మాణానికి ఇచ్చారని, కాలుష్యం, పంటలు దిగుబడి తగ్గుదల వంటి అనేక నష్టాలు భరిస్తూ త్యాగం చేశారని గుర్తు చేశారు. వారి ఉపాధికి భంగం కలిగే విధంగా ఉన్న మెర్జ్ విధానం సర్కులర్‌ను తక్షణమే రద్దు చేసి(ఉపసంహరణ) పాత విధానంలోనే టెండర్ ప్రక్రియ లో స్థానిక కాంట్రాక్టర్లకే కేటాయించి వారిని ఆదుకోవాలని, వారికి ఉపాధి చూపించాలన్నారు. జెన్కో సీఎండీ దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి, తదుపరి చర్యలు నిమిత్తం ఉన్నతాధికారులతో సూచనలు మేరకు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కు లోకల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Next Story