కుత్బుల్లాపూర్ జోన్‌లో 'స్పెషల్ టాస్క్ ఫోర్స్'.. ఇక పౌర సమస్యలకు చెక్!

by Jakkula.Mamatha |

కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగా, పౌర సేవలను మరింత వేగవంతం చేసేందుకు, వర్షాకాలంలో తలెత్తే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నడుం బిగించింది.

కుత్బుల్లాపూర్ జోన్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్.. ఇక పౌర సమస్యలకు చెక్!
X

దిశ, పేట్ బషీరాబాద్: కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగా, పౌర సేవలను మరింత వేగవంతం చేసేందుకు, వర్షాకాలంలో తలెత్తే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నడుం బిగించింది. జోన్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో 'స్పెషల్ టాస్క్ ఫోర్స్' బృందాలు రంగంలోకి దిగాయి. ఈ మేరకు మంగళవారం జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ అందుబాటులో వచ్చిన టీం, వారికి అందజేసిన పరికరాలను టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి పరిశీలించారు.

'క్రాస్-యుటిలైజేషన్’ దిశగా.. ఈ బృందాలు రాబోయే మూడు నెలల పాటు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి, నిరంతరం పర్యవేక్షించనున్నాయి. కేవలం టౌన్ ప్లానింగ్ పనులకే పరిమితం చేయకుండా, నగరవాసుల అవసరాలకు అనుగుణంగా వివిధ పౌర విధుల్లో 'క్రాస్-యుటిలైజేషన్' చేయాలని కమిషనర్ పింకేష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో భాగంగా అక్రమ కట్టడాల కూల్చివేత, రోడ్ల ఆక్రమణల తొలగింపు, సైట్ క్లియరెన్స్ వంటి పనులను ఈ బృందాలు వేగవంతం చేయనున్నాయి. అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి క్లీన్ చేయడం, నిర్మాణ వ్యర్థాల తొలగింపు, మెగా పారిశుధ్య డ్రైవ్‌లలో ఈ బృందాలు పాల్గొంటాయి. వర్షాకాల విపత్తు నిర్వహణలో భాగంగా వర్షాల వల్ల రోడ్లపై నీరు నిలిచినప్పుడు తక్షణమే క్లియర్ చేయడం, రహదారులపై పడిన చెట్లను తొలగించడం మరియు ప్రమాదకరంగా ఉన్న నిర్మాణాలను స్థిరీకరించడం వంటి బాధ్యతలు కూడా వీటికే అప్పగించారు.

ఒక్కో సర్కిల్‌కు ఒక్కో బృందం..

కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలో జీడిమెట్ల, చింతల్, గాజులరామారం, నిజాంపేట, దుండిగల్, మేడ్చల్ సర్కిల్లో ఉన్న ఒక్కో టౌన్ ప్లానింగ్ విభాగానికి ఒక్కో బృందాన్ని కేటాయించడం జరిగింది. ఒక్కో బృందంలో 1 జేసీబీ, 1 ట్రాక్టర్, 1 గ్యాస్ కట్టర్, 1 ఎయిర్ కంప్రెసర్, 2 డ్రైవర్లు, 2 ఆపరేటర్లు, 2 కూలీలు ఉంటారని జోనల్ కమిషనర్ తెలిపారు.

"జీరో ఐడిల్ టైమ్" లక్ష్యంగా..

పనుల్లో ఏ మాత్రం జాప్యం జరగకుండా చూడాలని ఉన్నతాధికారులు ఏసీలకు దిశానిర్దేశం చేశారు. "జీరో ఐడిల్ టైమ్" నినాదంతో యంత్రాలు, సిబ్బందిని గరిష్టంగా వినియోగించుకోవాలని ఆదేశించారు. ప్రతి సర్కిల్‌లోని అసిస్టెంట్ కమిషనర్లు, ఫీల్డ్ సూపర్‌వైజర్లతో కలిసి ప్రతి వారం ముందుగానే పని ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి సర్కిల్‌కు ఒక ప్రత్యేక బృందాన్ని కేటాయించి, వారికి అవసరమైన యంత్ర సామగ్రిని, అంకితభావం గల సిబ్బందిని రంగంలోకి దించారు. సిబ్బంది భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ.. వారికి అవసరమైన రేడియం యూనిఫాం, సేఫ్టీ షూస్ మరియు రిబ్బన్లు అందించారు. ఒక్కో బృందానికి ఒక జేసీబీ, ఒక ట్రాక్టర్, ఒక గ్యాస్ కట్టర్, ఒక ఎయిర్ కంప్రెసర్ వంటి యంత్రాలతో పాటు ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు ఆపరేటర్లు, ఇద్దరు కూలీలను కేటాయించారు. దీని ద్వారా కుత్బుల్లాపూర్ జోన్‌ను అత్యుత్తమ పౌర సేవలు అందించే ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ పేర్కొన్నారు.

Next Story