కొత్తపల్లి రీచ్‌ పై అధికారుల డేగకన్ను..!

by Batti.Sumithra |

మిడ్జిల్ మండలం కొత్తపల్లి ఇసుక రీచ్‌పై రెవెన్యూ అధికారులు డేగకన్ను వేశారు.

కొత్తపల్లి రీచ్‌ పై అధికారుల డేగకన్ను..!
X

దిశ, మిడ్జిల్ : మిడ్జిల్ మండలం కొత్తపల్లి ఇసుక రీచ్‌పై రెవెన్యూ అధికారులు డేగకన్ను వేశారు. శనివారం కొత్తపల్లి గ్రామ శివారులోని గైరాన్, సీలింగ్, నదినాళా భూములను గుర్తించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారుల బృందానికి, అనుమతులు లేకుండా ఇసుక రీచ్‌లో అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్న మూడు హిటాచీలు కనిపించాయి. వెంటనే అధికారులు వాటిని సీజ్ చేశారు. ఇసుక మాఫియా ఆగడాల పై కొందరు స్థానిక రైతులు ఇప్పటికే ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. దుందుభి వాగులో రాత్రి వేళల్లో అక్రమ తవ్వకాలు నిర్వహిస్తూ ఇసుక దందా జోరుగా సాగుతోందని, దీనిపై రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఇటీవల మిడ్జిల్ మండల పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డికి రైతులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక సర్వే నిర్వహించాలని ఎమ్మెల్యే ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఆ మేరకు కొత్తపల్లి శివారులోని గైరాన్, సీలింగ్, నదినాళా భూములను గుర్తించేందుకు రెవెన్యూ అధికారుల బృందం దుందుభి వాగు పరిసర ప్రాంతాలకు వెళ్లింది. అదే సమయంలో ఇసుక రీచ్‌లో మూడు హిటాచీలతో అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్న హిటాచీలను అధికారులు సీజ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

గుట్టుగా అక్రమ రవాణా..?

మిడ్జిల్ మండలం కొత్తపల్లి శివారు నుంచి హైదరాబాద్‌కు ఇసుక అక్రమ రవాణా గుట్టుగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల తీసుకున్న ఇసుక రీచ్ అనుమతులు పూర్తిగా దుర్వినియోగమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. చీకటి పడిన తర్వాత దుందుభి వాగులో ఇసుక టిప్పర్లు హల్‌చల్ చేస్తున్నాయని చెబుతున్నారు. వే బిల్లులు లేకుండానే జీరో దందాకు తెరలేపడం మాఫియాకు అలవాటైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్తపల్లి శివారులో నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు అక్రమంగా ఇసుక తరలిస్తూ దళారులు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

డబ్బులు ఎర వేసి..?

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుగా నిలుస్తారనుకున్న వారిని డబ్బులతో ప్రలోభపెట్టడం మాఫియాకు అలవాటైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుడులు, కుల సంఘాలకు విరాళాల పేరుతో డబ్బులు ఇచ్చి, ముఖ్యంగా యువతను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో అనేక మందిని ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు మాఫియా చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. అలాగే అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ముందుకొచ్చిన నాయకులను సైతం విభజించి పాలించే విధానాన్ని అమలు చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

అక్రమ రవాణాను అడ్డుకుంటాం..

మిడ్జిల్ మండలం కొత్తపల్లి శివారులోని దుందుభి వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరిగితే అడ్డుకుంటామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు టైగర్ జంగయ్య హెచ్చరించారు. శనివారం ప్రభుత్వ గైరాన్ భూముల సర్వేకు వెళ్లిన అధికారులకు చిక్కిన హిటాచీలను సీజ్ చేయడాన్ని ఆయన స్వాగతించారు. ఇసుక అక్రమ రవాణా కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.

Next Story