- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నటరాజు సిగ 'పువ్వులు'.. ఆ దంపతులు
సృజనశీలురైన భార్యాభర్తలిద్దరూ ఒకే రంగంలో కలసి అడుగులు వేసి, రాణకెక్కడం అరుదైన విషయం.

సృజనశీలురైన భార్యాభర్తలిద్దరూ ఒకే రంగంలో కలసి అడుగులు వేసి, రాణకెక్కడం అరుదైన విషయం. అందులోనూ కళారంగంలో మరీ అరుదు. అలాంటి జంట అంటే, 1940-50ల తరానికి ముందుగా గుర్తొచ్చే పేర్లు రంగస్థల తారలు పువ్వుల సూరిబాబు – రాజేశ్వరి దంపతులు... ఆరో ఏట రంగస్థలంపై కాలుమోపినది మొదలు 53 ఏట కన్నుమూసే వరకు 47 సంవత్సరాలు ఏకధాటిన నటుడిగా, నాటక సమాజ నిర్వాహకుడిగా, నాటక ప్రయోక్తగా తన జీవితమంతా తెలుగు కళామతల్లికే అర్పించిన అసలు సిసలు కళాజీవి సూరిబాబు.
------------------
నేటి యూట్యూబ్ తరం... గూడవల్లి రామబ్రహ్మం ‘మాలపిల్ల’లో... ‘కొల్లాయి గట్టితేనేమి మా గాంధి మాలడై తిరిగితేనేమీ...’, అలాగే ఆయనదే ‘రైతుబిడ్డ’లో ‘నిద్ర మేల్కొనర తమ్ముడా...’ పాటలు చూసే ఉంటారు. ఎన్టీఆర్ సూపర్ హిట్ ‘శ్రీవేంకటేశ్వర మాహాత్మ్యం’లో నారద పాత్రను చిరస్మరణీయం చేసిన నటుడు గుర్తుండే ఉంటారు. అవన్నీ ఒక్కరే... పువ్వుల సూరిబాబు.. ఆయన సతీమణి రాజేశ్వరి.
పదహారో ఏటే సొంత డ్రామా కంపెనీ!
ఆ గానగంధర్వుడు కృష్ణాజిల్లా, గుడివాడ తాలూకా, బొమ్మలూరులో 1915 ఫిబ్రవరి 22న జన్మించారు. ఆరేళ్ళ వయసులోనే, పినతండ్రి ప్రోత్సాహంతో ‘బొబ్బిలి యుద్ధం’ నాటకంలో చిన రంగారావు పాత్రతో రంగస్థలమెక్కారు. మొదట పినతండ్రి లింగం అంజయ్య, తర్వాత గుడివాడ స్కూలు మాస్టర్లు, ఆ పైన సంగీతం నేర్పిన మేనమామ – సంగీత విద్వాన్ పూల హనుమాన్లు ఇచ్చిన ఆశీస్సుల ఫలితంగా రంగస్థలంపై రాణించారు. ఈలపాట (కె.) రఘురామయ్య, రేలంగి ఆయనకు బాల్యమిత్రులు. ఒక నాటక సమాజాన్నే స్థాపిస్తే బాగుంటుందని ఆ టీనేజ్ వయసులోనే సూరిబాబు భావించారు. ఆ కోరికతో ఆయన తన జీవితకాలంలో వేర్వేరు సందర్భాల్లో మూడు వేర్వేరు నాటక సమాజాలు స్థాపించాల్సి వచ్చింది. తొలిసారి నాటక సంస్థ పెట్టదలిచినప్పుడు, తల్లిని ఒప్పించి, ఆ రోజుల్లోనే ఇంట్లో ఉన్న వెయ్యి సవర్ల బంగారు నగల్ని రూ. 13 వేలకు అమ్మించారు. 40 మంది ట్రూపుతో ‘బాలకృష్ణ సమాజం’ 1931లో గుడివాడలో స్థాపించారు. అప్పటికి సూరిబాబు వయసు... నిండా పదహారేళ్ళే. కానీ, రెండేళ్ళలో ఆ సంస్థ మూలపడింది.
కళారాధనలో కలసిన మనసులు!
సినీ నటి కన్నాంబ, దర్శకుడు కడారు నాగభూషణం స్థాపించిన ‘రాజరాజేశ్వరీ నాట్యమండలి’లో సూరిబాబు కొంతకాలం వేషాలు వేశారు. తెనాలి చేరుకొని, అక్కడే దాదాపు ఏడేళ్ళున్నారు. రెండో ప్రయత్నంగా అక్కడ ‘సత్యన్నారాయణ నాట్య మండలి’ అనే నాటక సమాజాన్ని స్థాపించారు. అనంతర కాలంలో తెలుగునాట పేరెన్నికగన్న నటీనటులంతా ఆ సమాజంలో వేషాలు వేసినవారే! ఆ సమయంలోనే నటి రాజేశ్వరితో సూరిబాబుకు పరిచయమైంది. 1936 నుండి సూరిబాబు సొంత నాటక సమాజంలోనూ, ఇతర విడి నాటకాల్లోనూ వారిద్దరూ కలసి నటిస్తూ ఉండేవారు. మనసులు కలవడంతో, కళాసేవలో కలసి ఆశయసాధన చేయవచ్చనే ఉద్దేశంతో 1944లో వారిద్దరూ పెళ్ళాడారు. బెజవాడలో స్థిరపడ్డారు. ‘శ్రీరాజరాజేశ్వరి నాటక మండలి’ పేరుతో నాటక సమాజాన్ని స్థాపించారు. 24 ఏళ్ల పాటు అవిచ్ఛిన్నంగా సాగిన ఆ కంపెనీ నుంచి వరుసగా అన్నీ హిట్ నాటకాలే.
రంగస్థలిపైనా, రికార్డుల్లోనూ... ‘తారాశశాంక’ చరిత్ర!
కొప్పరపు సుబ్బారావు రచించి, సంగీత దర్శకత్వం వహించిన ‘తారాశశాంకం’ సూరిబాబు కంపెనీకి ఎంతో పేరు తెచ్చింది. బృహస్పతి పాత్రలో సూరిబాబు, ఆయన భార్య తార పాత్రలో రాజేశ్వరి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవారు. ఫలితంగా, నేల నలుచెరగులా ఆ నాటకం కొన్ని వందల ప్రదర్శనలు జరిగింది. ఆ నాటకం ఎంత పాపులరైందంటే, చివరకు 1940లలోనే ఆ నాటకాన్ని 6 గ్రామఫోన్ రికార్డుల సెట్టు రూపంలో విడుదల చేశారు. మూడు దశాబ్దాల తర్వాత 1977లో ఆ నాటకం ఈసారి ఒకటే లాంగ్ ప్లే (ఎల్పీ) రికార్డుగా విడుదల కావడం విశేషం.
కాళిదాసులో దండకం ఆయన బాణీయే!
1930లలో నాటకాల్లో నటిస్తూనే, సినీ రంగంలోనూ ప్రవేశించారు సూరిబాబు. వేల్ పిక్చర్స్ సారథి, బందరు వాడైన తెలుగు వ్యక్తి పి.వి. దాస్ ప్రోత్సాహంతో ‘సీతా కల్యాణం’తో తెరంగేట్రం చేశారు. ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’లో నారదుడి పాత్ర ధరించారు. గూడవల్లి తీసిన సారథీ వారి ‘మాలపిల్ల’, ఆ వెంటనే ‘రైతుబిడ్డ’ నుంచి సూరిబాబు ఇక సినీ రంగంలోనూ వెనుతిరిగి చూడలేదు. పద్యాలను స్వరపరచడానికి అప్పటి ప్రముఖ సంగీత దర్శకులు సైతం సూరిబాబు సహకారం తీసుకునేవారు. అక్కినేని ‘మహాకవి కాళిదాసు’లో ఘంటసాల గానం చేసిన ‘మాణిక్య వీణాం...’ అనే శ్యామలాదండకం ఇవాళ్టికీ పాపులర్. ఆ భక్తి రచన స్వరకల్పనలో సైతం సూరిబాబు హస్తం ఉంది. గాయని పి. సుశీల సహా పలువురికి పద్యం పాడడంలోని మెలకువలను నేర్పిన తెర వెనుక గురువు సూరిబాబు. అలాగే, అలనాటి నటి శ్రీరంజని భర్త కె. నాగుమణితో కలసి ఏయన్నార్‌తో ‘మహాకవి కాళిదాసు’ - ఎన్టీఆర్‌తో ‘ప్రమీలార్జునీయం’ (రెండోదానికి పాక్షికంగా తెర వెనుక) సినిమాలు నిర్మించారు.
ఆఖరు దాకా నాటకానికి అంకితం!
సినిమాల్లో ఎంత తలమునకలుగా ఉన్నా, నాటకాన్ని చివరి వరకు ఆ దంపతులు నిర్లక్ష్యం చేయలేదు. ఆ కృషిని గుర్తించి, తెనాలిలో 1958 మార్చిలో సూరిబాబును గజారోహణం చేయించి, కనకాభిషేకం, గండపెండేర బహూకరణతో భారీ సన్మానం నిర్వహించారు. నట దిగ్గజమైన పృథ్వీరాజ్ కపూర్ ఒకసారి విజయవాడలో ప్రదర్శనలిచ్చారు. ఆ సందర్భంలో ఆఖరి రోజున ప్రత్యేకంగా సూరిబాబు నాటకం చూశారు. మద్రాసు వెళ్లిన పృథ్వీరాజ్‌ను పత్రికా విలేఖరులు ఆంధ్రదేశ పర్యటన అనుభవాలు చెప్పమంటే, ఆయన ఒకటే మాట అన్నారు. “ఏం చెప్పను!? సూరిబాబు పాట నా చెవుల్లో ఇంకా గింగురుమంటూనే ఉంది” అని ప్రశంసించారు. సూరిబాబు నాటకాలంటే భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణకు ఎంతో ఆసక్తి. ఆయన అధ్యక్షతనే శ్రీరాజరాజశ్వరి నాట్యమండలి రజతోత్సవాలు జరపాలని సూరిబాబు కలలు గన్నారు. ఆ కోరిక నెరవేరకుండానే 1968 ఫిబ్రవరి 12న సూరిబాబు మరణించారు. నాటక సమాజాన్ని నడపడంలో భర్తకు అండగా నిలిచిన ఆదర్శ గృహిణి రాజేశ్వరి 1987 మే 16న కన్నుమూశారు. ఆఖరి శ్వాస దాకా ఆ నటరాజ సేవలోనే గడిపిన ఆ దంపతుల దివ్యస్మృతికి నీరాజనం. విజయవాడ సత్యనారాయణపురంలోని మునిసిపల్ పార్క్ దగ్గరలో “రాజేశ్వరి మేడ”గా పాపులరైన వారి నివాసం నేటికీ ఆ పాత జ్ఞాపకాలను పరిమళిస్తూనే ఉంది.
-రెంటాల జయదేవ,
రచయిత - జర్నలిస్ట్
ప్రభుత్వ 'నంది', 'గద్దర్' అవార్డుల విజేత






