విద్యుత్ ప్రమాదంలో జూనియర్ లైన్‌మన్‌కు తీవ్ర గాయాలు

by Ratna Kumari |

బోయినపల్లి తోకట్ట సబ్‌స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న జూనియర్ లైన్‌మన్ (జేఎల్‌ఎం) కిష్టాపురం మోహన్ విద్యుత్ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు.

విద్యుత్ ప్రమాదంలో జూనియర్ లైన్‌మన్‌కు తీవ్ర గాయాలు
X

దిశ, తిరుమలగిరి : బోయినపల్లి తోకట్ట సబ్‌స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న జూనియర్ లైన్‌మన్ (జేఎల్‌ఎం) కిష్టాపురం మోహన్ విద్యుత్ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. సమతానగర్‌లోని పీవీ ఎన్‌క్లేవ్ వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌పై విద్యుత్ మరమ్మతు పనులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మోహన్‌కు సుమారు 50 శాతం కాలిన గాయాలు కాగా, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తోటి కార్మికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధిత ఏడీ, ఏఈల నిర్లక్ష్యమే కారణమని విద్యుత్ కార్మికులు ఆరోపించారు. సిబ్బందిపై అధిక పనిభారం మోపుతూ భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గతంలో కూడా జూనియర్ లైన్‌మెన్‌లతో అధిక పని చేయించి ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపించారు.

విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా..

జేఎల్‌ఎం ప్రమాదానికి బాధ్యులైన ఓల్డ్ బోయినపల్లి డివిజన్ ఏడీ హక్, ఏఈ అఖిల్‌లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బోయినపల్లి సబ్‌స్టేషన్ ఎదుట విద్యుత్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు సామ్యూల్ జాన్, ప్రసాద్, ప్రభాకర్, సుమన మాట్లాడుతూ, జూనియర్ లైన్‌మెన్‌లను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తూ ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచుతున్నారని ఆరోపించారు. ఒక జూనియర్ లైన్‌మన్‌తో పాటు ఒక ఆర్టిజన్‌ను విధుల్లో ఉంచాల్సిన నిబంధనలను అధికారులు పాటించడం లేదని విమర్శించారు. కార్మికులను రోజువారీ కూలీల మాదిరిగా పనిచేయిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి గురైన జేఎల్‌ఎంను సంబంధిత అధికారులు పరామర్శించకపోవడం బాధాకరమని అన్నారు. ధర్నా విషయం తెలుసుకున్న ఇన్‌చార్జి ఎస్‌ఈ బ్రహ్మ అక్కడికి చేరుకుని కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. బాధిత కార్మికుడికి, అతని కుటుంబానికి శాఖ తరఫున అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ధర్నాను విరమించారు.

Next Story