ప్రజల మౌలిక వసతుల కల్పన పై ప్రత్యేక దృష్టి : కూనంనేని సాంబశివరావు

by Batti.Sumithra |

ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.

ప్రజల మౌలిక వసతుల కల్పన పై ప్రత్యేక దృష్టి : కూనంనేని సాంబశివరావు
X

దిశ, పాల్వంచ (రూరల్) : ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. పాల్వంచ మండల పరిధిలో వివిధ పథకాలు, గ్రాంట్ల రూపంలో విడుదలైన రూ.1.58 కోట్ల నిధులతో చేపట్టనున్న 17 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని సీసీ రోడ్లు, డ్రైన్లు, బీటీ రోడ్ల పునరుద్ధరణ పనులు, ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలను క్షేత్రస్థాయిలో గుర్తించి, ప్రాధాన్యతా క్రమంలోనే అభివృద్ధి పనులను చేపడుతూ నిధులను ఖర్చు చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తాను పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని శాఖల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొత్తగూడెం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, మరింత అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని పేర్కొన్నారు.

రహదారుల సౌకర్యం మెరుగుపడితేనే గ్రామాలు అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు. ప్రతి గ్రామం, పంచాయతీ కేంద్రంలో ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ సేవా కేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటు చేసేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. ప్రజల నమ్మకానికి అనుగుణంగా వారి సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నానని, అభివృద్ధి నిధులు రాబట్టేందుకు లభించే ప్రతి అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నామని అన్నారు.

శంకుస్థాపనలు చేసిన పనులు నాణ్యతా ప్రమాణాలతో, పదికాలాలపాటు ప్రజలకు ఉపయోగపడేలా నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పనులను నిత్యం పర్యవేక్షిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే ప్రజలు కూడా అభివృద్ధి పనులపై దృష్టి సారించి పర్యవేక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే. సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, సీపీఐ రాష్ట్ర నాయకులు ముత్యాల విశ్వనాథం, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, ఉప్పుశెట్టి రాహుల్, కాంగ్రెస్ నాయకులు ఎర్రంశెట్టి ముత్తయ్య, కొండా వెంకన్న, సీపీఐ నాయకులు, కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు, గుండాల నాగరాజు, నిమ్మల రాంబాబు, మన్నెం వెంకన్న, జకరయ్య, వై.ఎస్. గిరి, యాడ్రాతి రవి, కోరేం శేఖర్, కొంగర అప్పారావు, ఎస్.కే. ఖాసీం, గుగులోత్ రాములు, బాబురావు, వజ్జా నాగరాజు, కోటి తిరుపతయ్య, ఇరుకులపాటి సుధాకర్, భరత్, భూక్య రమేష్, బద్రు, రామారావు, జక్కుల సురేష్, సర్పంచులు, ఉపసర్పంచులు, వివిధ శాఖల అధికారులు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Next Story