Forex Kitty: ఒక్క వారంలో 5 బిలియన్ డాలర్లకు పైగా తగ్గిన ఫారెక్స్ కిట్టీ

by S Gopi |

బంగారం నిల్వల విలువ ఒక్క వారంలోనే 5.394 బిలియన్ డాలర్లు క్షీణించి 102.536 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

Forex Kitty: ఒక్క వారంలో 5 బిలియన్ డాలర్లకు పైగా తగ్గిన ఫారెక్స్ కిట్టీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత విదేశీ మారక నిల్వలు జూన్ 26తో ముగిసిన వారంలో 5.654 బిలియన్ డాలర్లు తగ్గి 666.933 బిలియన్ డాలర్లకు చేరాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వెల్లడించింది. అంతకుముందు వారంలో 963 మిలియన్ డాలర్ల మేర పెరిగిన నిల్వలు, ఈసారి మళ్లీ భారీగా తగ్గాయి. విదేశీ మారక నిల్వల్లో అత్యధిక వాటా ఉన్న విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సీఏ) 150 మిలియన్ డాలర్లు తగ్గి 541.067 బిలియన్ డాలర్లకు చేరగా, బంగారం నిల్వల విలువ ఒక్క వారంలోనే 5.394 బిలియన్ డాలర్లు క్షీణించి 102.536 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అలాగే ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు (ఎస్‌డీఆర్‌లు) 89 మిలియన్ డాలర్లు తగ్గి 18.558 బిలియన్ డాలర్లకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద భారత రిజర్వ్ పొజిషన్ 21 మిలియన్ డాలర్లు తగ్గి 4.772 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో భారత విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో 728.494 బిలియన్ డాలర్లను తాకాయి. అయితే పశ్చిమాసియాలో భౌగోళిక ఉద్రిక్తతలు, రూపాయిపై ఒత్తిడి పెరగడం, విదేశీ మారక మార్కెట్‌ను స్థిరీకరించేందుకు ఆర్‌బీఐ డాలర్లు విక్రయించడం వంటి పరిణామాల నేపథ్యంలో నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇదే సమయంలో విదేశీ మారక నిల్వలను పరిరక్షించేందుకు విదేశీ ప్రయాణాలు, ఇంధన వినియోగం, బంగారం దిగుమతులను తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల పలుమార్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత గణాంకాలు చూస్తే, అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల మధ్య భారత విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి ఇంకా కొనసాగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

Next Story