- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో విద్యార్థిని అదృశ్యం
కారేపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో మైనర్ విద్యార్థిని అదృశ్యమైన ఘటన విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళనకు దారితీసింది.

దిశ, కారేపల్లి : కారేపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో మైనర్ విద్యార్థిని అదృశ్యమైన ఘటన విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళనకు దారితీసింది. విద్యార్థులను పంపించే విషయంలో తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను అమలు చేయకపోవడం, పర్యవేక్షణలో లోపాలు ఉండటమే ఈ ఘటనకు కారణమని విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. గురువారం సాయంత్రం హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన విద్యార్థిని తిరిగి రాకపోవడంతో శనివారం సంబంధిత అధికారులు పాఠశాలకు చేరుకుని విస్తృతంగా విచారణ నిర్వహించారు. పోలీసులు విద్యార్థిని ఆచూకీ గుర్తించి కారేపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి, అనంతరం శనివారం భరోసా కేంద్రానికి తరలించారు. ఘటనకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విద్యార్థులను తల్లిదండ్రులు లేదా అధికారికంగా గుర్తింపు పొందిన సంరక్షకులు స్వయంగా వచ్చినప్పుడే పాఠశాల నుంచి పంపించాలనే నిబంధనలను పూర్తిగా విస్మరించారని విజిలెన్స్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి వివరాలను నిర్ధారించకుండా, గుర్తింపు పత్రాలను పరిశీలించకుండా, ఎలాంటి ధృవీకరణ ప్రక్రియను పాటించకుండానే విద్యార్థినిని బయటి వ్యక్తులతో పంపించడం తీవ్ర నిర్లక్ష్యమని పేర్కొన్నారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు. ఈ విషయమై ప్రిన్సిపల్‌ను వివరణ కోరగా, తన సమక్షంలో ఓ మహిళ విద్యార్థినికి పిన్ని అని చెప్పి, "మా అక్క కూతురు" అంటూ లేఖ అందజేసి, క్లాస్ టీచర్‌ను నమ్మించి విద్యార్థినిని తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారం ముందస్తు ప్రణాళిక ప్రకారమే పక్కా ప్లాన్‌తో విద్యార్థినిని తీసుకెళ్లినట్లు తెలిపారు. ఘటనపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. మరోవైపు, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విద్యార్థినిని ఎలా పంపించారని బాలిక తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విద్యార్థిని భద్రతకు ఏదైనా ముప్పు ఏర్పడి ఉంటే అందుకు పాఠశాల యాజమాన్యం, ముఖ్యంగా ప్రిన్సిపల్ బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో, రాత్రి వేళల్లో ప్రిన్సిపల్ విద్యార్థులకు అందుబాటులో ఉండడం లేదని, బాధ్యతలను కాంట్రాక్టు ఉపాధ్యాయులకే అప్పగించి సాయంత్రానికే నివాసానికి వెళ్లిపోతున్నారని కొందరు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల భద్రత విషయంలో యాజమాన్యం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.






