నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్.. 5 జిల్లాల్లో జాబ్ మేళా

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలోని వృత్తి విద్యా విద్యార్థులు, ఫ్రెషర్లకు ప్రముఖ పరిశ్రమలలో ఉద్యోగ, అప్రెంటిస్‌షిప్ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్.. 5 జిల్లాల్లో జాబ్ మేళా
X
  • జులై 6 నుండి 'అప్రెంటిస్‌షిప్-కమ్-జాబ్ మేళా'
  • ఇంటర్మీడియట్ విద్యాశాఖ, ఆర్డీఎస్ డీఈ సంయక్తంగా నిర్వహణ

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని వృత్తి విద్యా విద్యార్థులు, ఫ్రెషర్లకు ప్రముఖ పరిశ్రమలలో ఉద్యోగ, అప్రెంటిస్‌షిప్ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇంటర్మీడియట్ విద్యా శాఖ, రీజినల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (ఆర్ డీఎస్డీఈ) సంయుక్త ఆధ్వర్యంలో జూలై 6 నుండి జూలై 14 వరకు రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో అప్రెంటిస్‌షిప్-కమ్-జాబ్ మేళా–2026 నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ 'స్కిల్ ఇండియా మిషన్', 'నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (ఎన్ఏపీఎస్-2)' కింద యువర్ స్కిల్స్, యువర్ ఫ్యూచర్, అవర్ మిషన్ అనే నినాదంతో ఈ ప్రత్యేక డ్రైవ్ జరగనుంది. ఈ మేళాలో ఎంపికై అప్రెంటిస్‌షిప్ శిక్షణ పొందే అభ్యర్థులకు అప్రెంటిస్‌షిప్ చట్టం ప్రకారం నెలకు రూ. 9600 స్టైపెండ్ అందజేస్తారు. అలాగే పారామెడికల్, నాన్ పారామెడికల్ విభాగాల్లోని ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పాల్గొని తక్షణ ఇంటర్వ్యూల ద్వారా ఆన్ ది స్పాట్ ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నాయి. ఇందులో 2023, 2024, 2025, 2026 విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన వృత్తి విద్యా విద్యార్థులు, ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఫ్రెషర్లు, గత మూడేళ్లలో పాసైన జాబ్ సీకర్స్, ఇదివరకు ఎక్కడా అప్రెంటిస్‌షిప్ శిక్షణ పొందని వారు మాత్రమే దీనికి అర్హులని తెలిపారు. ఈ మేళా ప్రతిరోజు రెండు సెషన్లుగా జరుగుతుంది. ఉదయం సెషన్‌లో పారామెడికల్ విభాగానికి, మధ్యాహ్నం సెషన్‌లో నాన్-పారామెడికల్ విభాగానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. జులై 6న కుత్భుల్లాపూర్ ఎస్ కేపీఎం జూనియర్ కాలేజీ, జులై 7న సికింద్రాబాద్ మరిడ్పల్లి కస్తూర్భాగాంధీ జూనియర్ కాలేజీ, జులై 13న హన్మకొండ ప్రభుత్వ వ్రుత్తి జూనియర్ కాలేజీ, జులై 14న మహబూబ్ నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ, నల్గొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్వూలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు డైరెక్టర్ మాట్లాడుతూ ఈ మేళా ద్వారా అప్రెంటిస్‌షిప్ చట్టం, 1961 ప్రకారం ప్రముఖ కంపెనీలను, విభిన్న ఉద్యోగాలను ఒకే వేదికపైకి తెస్తున్నాం. కేవలం నియామకాలే కాకుండా కెరీర్ కౌన్సెలింగ్, నైపుణ్యాభివృద్ధిపై నిపుణులతో అవగాహన సదస్సులు కూడా ఉంటాయి. అర్హులైన యువతీ యువకులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి" అని కోరారు.

Next Story