- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగతనం కేసును ఛేదించిన షాద్‌నగర్ పోలీసులు
తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాలోని ప్రధాన నిందితుడిని షాద్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు.

దిశ, షాద్ నగర్: తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాలోని ప్రధాన నిందితుడిని షాద్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. షాద్ నగర్ ఏసిపి ఎస్. లక్ష్మీనారాయణ కథనం ప్రకారం జూన్ 22వ తేదీ రాత్రి షాద్ నగర్ పట్టణంలోని సాయిబాలాజీ టౌన్‌షిప్‌లో యెన్నం వీరేందర్ రెడ్డి నివాసంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళాలు ధ్వంసం చేసి సుమారు 18 తులాల బంగారం, వెండి ఆభరణాలను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 517/2026 కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ దృశ్యాలు, ప్రత్యేక నిఘా తో నిందితులను గుర్తించిన పోలీసులు దొంగిలించిన బంగారు ఆభరణాలను శనివారం విక్రయించేందుకు వెళ్తున్న సమయంలో ప్రధాన నిందితుడు సోహెల్ ఖురేషిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా నేరాన్ని చేసినట్లు అంగీకరించాడు.
మరో నిందితుడి కోసం గాలింపు
దొంగతనం చేసిన బంగారాన్ని నిందితులు సోహెల్ ఖురేషి, ఇమ్రాన్ పరస్పరం పంచుకున్నట్లు విచారణలో వెల్లడైంది. సోహెల్ ఖురేషి తన వాటాగా వచ్చిన రెండు బంగారు ఉంగరాలను విక్రయించి రూ.1 లక్ష నగదులో రూ.76 వేలతో హైదరాబాద్ కోటి జగదీష్ మార్కెట్‌లో ఐఫోన్ 17 ఎయిర్ కొనుగోలు చేసినట్లు తెలిపాడు. మిగిలిన నగదును వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేసినట్లు, మిగిలిన బంగారు ఆభరణాలను ఇంట్లో దాచిపెట్టినట్లు అంగీకరించాడు. నిందితుడు సోహెల్ ఖురేషి వద్ద నుంచి 3 తులాల బంగారు గొలుసు, 8.5 తులాల మూడు బంగారు నెక్లెస్‌లు, 2.5 తులాల ఐదు జతల బంగారు చెవిపోగులుతో పాటు తెలుపు రంగు ఐఫోన్ 17 ఎయిర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు ఇమ్రాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన ప్రధాన నిందితుడు సోహెల్ ఖురేషి ని శనివారం న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన ఎస్‌ఐలు ఆర్. శ్రీకాంత్ నాయక్, శివారెడ్డి, షాద్ నగర్ క్రైమ్ టీం సభ్యులు హెడ్ కానిస్టేబుల్ రవీంద్ర నాయక్, కానిస్టేబుళ్లు కరుణాకర్, సంతోష్, జాకీర్, మోహన్ లాల్, రాజు, రఫీ, సీసీఎస్ ఫ్యూచర్ సిటీ సిబ్బంది ప్రవీణ్, రాజులను షాద్ నగర్ జోన్ డీసీపీ శిరీష అభినందించారు. .






