- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్నినోకు ముందే అప్రమత్తం : మంత్రి వివేక్ వెంకటస్వామి
ఎల్నినో ప్రభావం కారణంగా తలెత్తే ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు.

దిశ, సంగారెడ్డి అర్బన్ : ఎల్నినో ప్రభావం కారణంగా తలెత్తే ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఎల్నినో ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై సోమవారం సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మెదక్, సంగారెడ్డి జిల్లాల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలు, ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలు, జిల్లాల వారీ అమలు తీరు పై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్నినో ఒక సహజ ప్రకృతి విపత్తు అని, దీని ప్రభావాన్ని అర్థం చేసుకొని నష్టాన్ని వీలైనంత తగ్గించే దిశగా ముందస్తు ప్రణాళికతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. లోటు వర్షపాతం, నీటి కొరత, పంటలపై ప్రతికూల ప్రభావం వంటి పరిస్థితులను ముందుగానే అంచనా వేసి శాఖల వారీ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు.
వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, భూగర్భ జలాలు, విద్యుత్ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒక ఎకరం వరి సాగుకు అవసరమైన నీటితో నాలుగు ఎకరాల ఆయిల్ పామ్ లేదా ఎనిమిది ఎకరాల కంది పంట సాగు చేయవచ్చని పేర్కొన్నారు. రైతులు పరిస్థితులకు అనుగుణంగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు, అంతర్ పంటల సాగుపై దృష్టి సారించేలా అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. రైతులకు అవగాహన కల్పించేందుకు వీడియో రీల్స్, నాటక ప్రదర్శనలు, కళాజాతాలు, అన్ని ప్రచార మాధ్యమాలను వినియోగించాలని సూచించారు. జిల్లాల్లో పలుచోట్ల కోతుల బెడద ఉన్నందున దానిని నివారించే చర్యలు చేపడితే రైతులు పంటల మార్పిడి వైపు మరింతగా మొగ్గు చూపే అవకాశం ఉంటుందని అన్నారు.
ఎల్నినో ప్రభావం తీవ్రత పెరిగితే భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నందున నీటి వృథాను అరికట్టడంతో పాటు భూగర్భ జలాల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. బోర్‌వెల్‌ల రీచార్జ్, వర్షపు నీటి సంరక్షణ, నీటి వినియోగంలో పొదుపు వంటి చర్యలను విస్తృతంగా అమలు చేయాలని సూచించారు. ప్రజలకు తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పశువులకు మేత కొరత ఏర్పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, అలాగే ఆరోగ్య శాఖ సీజనల్ వ్యాధుల నివారణతో పాటు ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి ఎ. వాణి ప్రసాద్ మాట్లాడుతూ, ఎల్-నినోను ముందస్తుగా అంచనా వేసి ప్రభుత్వం ప్రతి శాఖను సమాయత్తం చేస్తోందన్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడడమే ఈ ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.
సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఎల్-నినోపై అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలన్నారు. జిల్లాలో కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో వాటి నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పంట నష్టం జరిగిన రైతులకు నష్టపరిహారంగా ఎకరాకు రూ.25 వేల చొప్పున అందించే అంశాన్ని కేబినెట్‌లో చర్చించాలని డిమాండ్ చేశారు.
సంజీవరెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే...
సింగూరు డ్యాం మరమ్మతుల కోసం మొత్తం నీటిని విడుదల చేయడం జరిగిందని, ప్రస్తుతం 8 టీఎంసీల నీరు అందుబాటులో ఉందన్నారు. రైతులను, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ఏర్పాట్లు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
మాణిక్యరావు – జహీరాబాద్ ఎమ్మెల్యే...
తక్కువ నీటితో సాగయ్యే పంటలపై రైతులకు శిక్షణ ఇవ్వాలని, అందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
చింత ప్రభాకర్ – సంగారెడ్డి ఎమ్మెల్యే...
స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి, తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, సంగారెడ్డి అదనపు ఎస్పీ చైతన్య, ఇరిగేషన్, భూగర్భ జలాలు, విద్యుత్ శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలోని వర్షపాత పరిస్థితులు, భూగర్భ జలాల స్థితి, జల వనరుల్లో నీటి లభ్యత, ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. ఎల్-నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి రైతులకు నష్టం జరగకుండా తక్కువ నీటి పంటల వైపు మళ్లించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. గ్రామస్థాయి నుంచే అవగాహన కార్యక్రమాలు చేపట్టి రైతులను సిద్ధం చేస్తున్నామన్నారు.






