పోలీసుశాఖకు వెన్నెముక స్పెషల్ బెటాలియన్స్ : డీజీపీ సీవీ ఆనంద్

by Muthe.Rajitha |

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల విధులు, విపత్తు నిర్వహణ వంటి కీలక రంగాల్లో తెలంగాణ స్పెషల్ బెటాలియన్స్ పోలీసు శాఖకు వెన్నెముకగా నిలుస్తున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

పోలీసుశాఖకు వెన్నెముక స్పెషల్ బెటాలియన్స్ : డీజీపీ సీవీ ఆనంద్
X

దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల విధులు, విపత్తు నిర్వహణ వంటి కీలక రంగాల్లో తెలంగాణ స్పెషల్ బెటాలియన్స్ పోలీసు శాఖకు వెన్నెముకగా నిలుస్తున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని బెటాలియన్ల ప్రధాన కార్యాలయంలో ఆయన సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా ఈ బలగాలను మరింత ఆధునీకరించి, సాంకేతికంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యాలయంలోని ఆయుధాగారం, కమ్యూనికేషన్ వ్యవస్థలు, మౌలిక వసతుల పనులను స్వయంగా తనిఖీ చేసిన డీజీపీ.. ఖాళీ పోస్టుల భర్తీ, వాహనాల లభ్యత పెంచాలని అధికారులను ఆదేశించారు.

స్పెషల్ బెటాలియన్లు ధైర్యసాహసాలు చారిత్రాత్మకం..

ఉమ్మడి రాష్ట్రంలో నక్సలిజం ఉధృతంగా ఉన్నప్పుడు స్పెషల్ బెటాలియన్లు సివిల్ పోలీసులతో భుజం భుజం కలిపి పోరాడిన తీరును ఆయన గుర్తుచేసుకున్నారు. తాను నిజామాబాద్, వరంగల్ జిల్లాల ఎస్పీగా ఉన్నప్పుడు పోలీసు స్టేషన్ల రక్షణలో వారు ప్రదర్శించిన ధైర్యసాహసాలు చారిత్రాత్మకమని కొనియాడారు. కమాండెంట్ల పాత్ర కేవలం క్రమశిక్షణకే పరిమితం కాకుండా, సిబ్బంది సంక్షేమ పర్యవేక్షకులుగా ఉండాలన్నారు. సుదీర్ఘకాలం కుటుంబాలకు దూరంగా ఉండటం వల్ల సిబ్బంది మానసిక ఒత్తిడికి గురవుతారని, వారి కుటుంబ ఆరోగ్య, విద్యా సమస్యల పట్ల అధికారులు మానవతా దృక్పథంతో స్పందించాలని సూచించారు.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, డ్రగ్స్ బారిన పడకుండా చూడాలి..

డ్యూటీల కేటాయింపులో ఎలాంటి వివక్ష లేకుండా పారదర్శకత పాటించాలని డీజీపీ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ కాలంలో సిబ్బంది ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, మాదకద్రవ్యాల డ్రగ్స్ బారిన పడకుండా నిరంతరం నిఘా ఉంచాలన్నారు. ఎవరైనా వ్యసనాలకు బానిసలైతే వారికి తక్షణమే వైద్య సాయం అందించాలని ఆదేశించారు. మనోధైర్యం దెబ్బతిన్న సిబ్బంది కోసం ‘మిత్ర’ కౌన్సెలింగ్ కేంద్రాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. పోలీసుల్లో ఆత్మహత్యల నివారణకు సమగ్ర వ్యూహం అమలు చేయాలని, ప్రవర్తనలో మార్పులను గమనించి సకాలంలో స్పందించాలన్నారు. శిక్షణలో ఫిజికల్ ఫిట్‌నెస్‌తో పాటు టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ఫ్యూచర్ సిటీలో కొత్తగా ప్రత్యేక బెటాలియన్ల ఏర్పాటు..

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఫ్యూచర్ సిటీ, ఆమనగల్ ప్రాంతాల్లో కొత్తగా ప్రత్యేక బెటాలియన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని డీజీపీ వెల్లడించారు. ఇటీవల నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వరదల సమయంలో ప్రజలను కాపాడిన సిబ్బంది తెగువను ఈ సందర్భంగా అభినందించారు. క్రమశిక్షణ, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలని డీజీపీ ఆకాంక్షించారు. ఈ సమీక్షలో బెటాలియన్ల ఉన్నతాధికారులు, కమాండెంట్లు పాల్గొన్నారు.

Next Story