- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వనస్థలిపురంలో ఎస్‌వోటీ పోలీసుల మెరుపు దాడి.. అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్
వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న రాకెట్‌ను ఎస్‌వోటీ పోలీసులు ‘డెకాయ్ ఆపరేషన్’ ద్వారా ఛేదించారు.

దిశ, వనస్థలిపురం: వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న రాకెట్‌ను ఎస్‌వోటీ పోలీసులు ‘డెకాయ్ ఆపరేషన్’ ద్వారా ఛేదించారు. ఈ వ్యవహారంలో హయగ్రీవ ఆస్పత్రి డైరెక్టర్ కొర్ర రాజు, రిసెప్షనిస్ట్ లోకేశ్, తుక్కుగూడలోని శ్రీ సాయి ధనుష్ క్లినిక్ ల్యాబ్ టెక్నీషియన్ విజయ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. గర్భంలోని శిశువు లింగాన్ని నిర్ధారించి చెబుతామని హామీ ఇస్తూ ఆస్పత్రి నిర్వాహకులు వ్యవహరిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తమకు తెలిసిన వ్యక్తి ద్వారా స్కానింగ్ చేసి పుట్టబోయే బిడ్డ ఆడా, మగా అనే వివరాలు చెబుతారని బాధితులను తుక్కుగూడకు పంపిస్తున్నట్లు గుర్తించారు.
సమాచారం మేరకు పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. అనంతరం శ్రీ సాయి ధనుష్ క్లినిక్‌పై దాడి చేసి అక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిపై పీసీపీఎన్డీటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఇలాంటి తీవ్రమైన నేరానికి పాల్పడిన ఆస్పత్రిని సీజ్ చేయడంతో పాటు సంబంధిత వైద్యుడి లైసెన్స్‌ను రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం కేసు నమోదు చేసి వదిలేయకుండా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అక్రమ లింగ నిర్ధారణలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని వనస్థలిపురం సీఐ రవిబాబు హెచ్చరించారు.






