‘బిర్యానీ కొనిస్తే అమ్మాయిని అనుభవించొచ్చు’ అంటూ కామెంట్స్.. ఎట్టకేలకు ‘సారీ’ చెప్పిన స్టాండప్ కమెడియన్

by Gantepaka Srikanth |

సోషల్ మీడియాలో వెల్లువెత్తిన తీవ్ర విమర్శలు, నెటిజన్ల ఆగ్రహం నేపథ్యంలో ప్రముఖ స్టాండప్ కమెడియన్ ప్రణిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేశారు.

‘బిర్యానీ కొనిస్తే అమ్మాయిని అనుభవించొచ్చు’ అంటూ కామెంట్స్.. ఎట్టకేలకు ‘సారీ’ చెప్పిన స్టాండప్ కమెడియన్
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో వెల్లువెత్తిన తీవ్ర విమర్శలు, నెటిజన్ల ఆగ్రహం నేపథ్యంలో ప్రముఖ స్టాండప్ కమెడియన్ ప్రణిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేశారు. తన కామెడీ షోకు సంబంధించిన ‘రూ.370 బిర్యానీ' వీడియో క్లిప్ తీవ్ర వివాదాస్పదంగా మారడంతో, ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పిన కొద్దిసేపటికే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ప్రణిత్ నిర్వహించిన ఒక స్టాండప్ కామెడీ షోలో ప్రేక్షకుడిగా వచ్చిన ఓ యువకుడు మహిళలను కించపరిచేలా మాట్లాడాడు. తాను ఒక అమ్మాయితో డేట్‌కు వెళ్లినప్పుడు రూ.370 ఖర్చు పెట్టి చికెన్ బిర్యానీ ఇప్పించానని, అయితే డేట్ ముగిసిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోవాలని అనుకోవడంతో తనకు నష్టం వచ్చినట్లు అనిపించిందని అన్నాడు. పెట్టిన డబ్బును వసూలు చేసుకోవడానికి (శారీరక సాన్నిహిత్యం ద్వారా) ప్రయత్నించానంటూ సదరు యువకుడు అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో వేదికపై ఉన్న కమెడియన్ ప్రణిత్ ఆ వ్యాఖ్యలను అడ్డుకోకపోగా, గట్టిగా నవ్వుతూ సమర్థించారు. అంతేకాకుండా ఆ షోలో కథ బాగా చెప్పావంటూ ఆ యువకుడికి రూ.5000 బహుమతి కూడా ఇచ్చారు. అనంతరం ఈ వీడియో క్లిప్‌ను ప్రణిత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వివాదం వ్యాపించింది.

నెటిజన్ల తీవ్ర ఆగ్రహం..

మహిళల అంగీకారంతో సంబంధం లేకుండా, వారిపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఉన్న ఈ వీడియోపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సామాన్యుల నుంచి సెలబ్రిటిల వరకు అందరూ మండిపడ్డారు. విమర్శలు ముదరడంతో ప్రణిత్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. "వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఆ వ్యాఖ్యలను చూసి నవ్వి ఊరుకోవడం కంటే, నేను వాటిని అక్కడికక్కడే ఖండించి ఉండాల్సింది. నా వైపు నుంచి పొరపాటు జరిగిన జరిగింది. అందుకే ఈ వీడియోను తొలగించాను" అని పేర్కొన్నారు. మరోవైపు ఈ వివాదం నేపథ్యంలో సదరు వ్యాఖ్యలు చేసిన యువకుడిని అతని కంపెనీ ఉద్యోగం నుండి తక్షణమే తొలగించింది. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ (NCW) ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి ఇద్దరికీ నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్‌లో అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రచారం చేసినందుకు గానూ మహారాష్ట్ర సైబర్ పోలీసులు ప్రణిత్‌తో పాటు పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాల అనంతరం ప్రణిత్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను డియాక్టివేట్ చేయగా.. తప్పు చేసి బాధ్యత నుండి పారిపోవడమేనంటూ నెటిజన్లు మళ్లీ విమర్శలు గుప్పిస్తున్నారు.

Next Story