తండ్రి ఆస్తి పై కొడుకు 'కపట' ప్రేమ!

by Malleboina Mahesh |

"ఆధార్ కార్డు పేరుతో కన్నతల్లిని నమ్మించి ఆస్తి కాజేసిన కొడుకు! గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో అక్రమ రిజిస్ట్రేషన్ కలకలం. న్యాయం కోసం బాధితుల పోరాటం."

తండ్రి ఆస్తి పై కొడుకు కపట ప్రేమ!
X

దిశ, ఇటిక్యాల: ఆస్తి కోసం అడ్డదారులు తొక్కే కాలమిది. కన్న ప్రేమ కంటే కాసుల పైనే మక్కువ పెంచుకున్న ఓ కొడుకు, తన తల్లి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారసత్వ భూమిని కాజేశాడు. "అమ్మా.. నీ ఆధార్ కార్డు తప్పుంది, సరిచేయకపోతే పెన్షన్ రాదు" అని నమ్మించి, నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకెళ్లి వేలిముద్రలు వేయించుకున్నాడు. తండ్రి చనిపోయిన ఏడాదికే, తోబుట్టువులకు తెలియకుండా దొంగ సాక్షులతో కలిసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైనం జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో కలకలం రేపుతోంది. బాధితులు జిల్లా అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, విచారణ జరపాలని తహసీల్దార్‌ను ఆదేశించినా ఆరు నెలలుగా రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.

ఆస్తిపై మితిమీరిన ఆశ మానవ సంబంధాలను మంటగలుపుతోంది. కన్నతల్లి అని కూడా చూడకుండా, ఆమె నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని ఓ కొడుకు తండ్రి ఆస్తిని కాజేసిన ఉదంతం జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని పెద్ద దిన్నె గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారసత్వంగా రావాల్సిన ఆస్తిలో తోబుట్టువులకు వాటా లేకుండా చేసేందుకు సదరు కిలాడీ కొడుకు పక్కా స్కెచ్ వేశాడు.

అమాయకత్వమే పెట్టుబడిగా..

పెద్ద దిన్నె గ్రామానికి చెందిన లక్ష్మన్న (తండ్రి కానన్న)కు సర్వే నెంబర్ 255/బి లో 4 ఎకరాల 10 గుంటలు, సర్వే నంబర్ 273/A1/2 లో 15 గుంటల వ్యవసాయ భూమి ఉంది. లక్ష్మన్న 20-06-2020 న మరణించారు. నిబంధనల ప్రకారం ఈ ఆస్తిలో ఆయన భార్య శేషమ్మ తో పాటు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు నాగరాజుకు సమాన హక్కులు ఉంటాయి. కానీ, మొత్తం భూమిని తన పేరిట మార్చుకోవాలని నాగరాజు పథకం పన్నాడు. చదువురాని తల్లిని నమ్మించి, "అమ్మా.. నీ ఆధార్ కార్డులో తప్పులు ఉన్నాయి, సరిచేయకపోతే పెన్షన్ రాదు" అని అబద్ధం చెప్పి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకెళ్లాడు. అక్కడ కేవలం వేలిముద్రలు వేస్తే పని అయిపోతుందని నమ్మబలికి, 28-06-2021 న రాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.

దొంగ సాక్షుల దగా..

ఈ అక్రమ రిజిస్ట్రేషన్‌లో నాగరాజుకు ఇద్దరు వ్యక్తులు సహకరించారు. నాగరాజు అనే వ్యక్తితో పాటు కేఎస్డీ రాజు అనే ప్రభుత్వ ఉద్యోగి దొంగ సాక్షులుగా సంతకాలు చేయడం గమనార్హం. ఆ తల్లికి జరుగుతున్నది 'ఆధార్ అప్‌డేట్' కాదని, 'భూమి బదలాయింపు' అని తెలిసి కూడా వారు నిందితుడికి సహకరించి కుటుంబ సభ్యులకు తీరని అన్యాయం చేశారు. ధరణి పోర్టల్‌లో పేరు మారిన తర్వాత గానీ ఇతర వారసులకు ఈ మోసం బయటపడలేదు.

అదనపు కలెక్టర్ ఆదేశాలకే దిక్కు లేదు!

తమకు జరిగిన అన్యాయంపై బాధితురాలు శేషమ్మ, కూతురు నీలావతి జిల్లా కలెక్టర్‌కు సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్.. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇటిక్యాల తహసీల్దార్‌ను ఆదేశించారు. అయితే, ఉన్నతాధికారుల ఉత్తర్వులు వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇటిక్యాల రెవెన్యూ యంత్రాంగం ఉలుకూ పలుకూ లేకుండా వ్యవహరిస్తోంది. విచారణాధికారి బాధితులను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారని, పరోక్షంగా నిందితుడికి సహకరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.

Next Story