దీక్ష విరమణ తర్వాత సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన

by Malleboina Mahesh |

కేంద్రం నుంచి రాతపూర్వక హామీ రావడంతో 26 రోజుల ఆమరణ దీక్షను విరమించిన సోనమ్ వాంగ్‌చుక్. విద్యార్థులపై కేసులు రద్దు, పరిహారానికి ప్రభుత్వం అంగీకారం.

దీక్ష విరమణ తర్వాత సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో గత 26 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్.. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వత దీక్ష విరమించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ఇతర నేతలు కీలక వ్యక్తులతో సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా దీక్ష విరమణ తర్వాత సోనమ్ వాంగ్‌చుక్ ఓ వీడియోను విడుదల చేస్తూ.. కేంద్రం ఇచ్చిన హామీలపై సంచలన ప్రకటన చేశారు. అందులో.. సోనమ్ వాంగ్‌చుక్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన రాతపూర్వక హామీ (Written Assurance) లభించిన తర్వాతే తాను దీక్షను విరమించినట్లు స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న ప్రధాన హామీలు

కేసుల ఎత్తివేత: జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై గానీ, జులై 20న ‘సంసద్ ఛలో’ మార్చ్‌లో పాల్గొన్న వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు, ఎఫ్‌ఐఆర్‌లు (FIRs) నమోదు చేయబడవు.

నష్టపరిహారం: నీట్ పేపర్ లీక్ ఘటన, దాని తదనంతర పరిణామాల వల్ల ప్రాణాలు కోల్పోయిన 20 మందికి పైగా విద్యార్థుల కుటుంబాలకు తగిన ఆర్థిక పరిహారం అందిస్తారు.

పార్లమెంట్‌లో చర్చ: భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా విద్యావ్యవస్థ, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, ప్రభుత్వ జవాబుదారీతనంపై పార్లమెంట్‌లో సుదీర్ఘమైన చర్చ జరుపుతారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై స్పందిస్తూ.. రాజీనామా ఎప్పుడు జరుగుతుందనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన కాలపరిమితి రానప్పటికీ, తన ప్రాణం కంటే విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకోవడం, వారిపై కేసులు లేకుండా చూడడమే అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. మంత్రి రాజీనామా చేయకపోవడం వల్ల ప్రభుత్వానికే నష్టమని వ్యాఖ్యానిస్తూ, ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

Next Story