మాకు అడ్డెవ్వరు అది మా అడ్డా..!

by Jakkula.Mamatha |

దేశంలోనే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అత్యంత రద్దీగా ఉంటుంది.

మాకు అడ్డెవ్వరు అది మా అడ్డా..!
X

దిశ, నార్కట్ పల్లి: దేశంలోనే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అత్యంత రద్దీగా ఉంటుంది. ఈ రహదారిపై నిత్యం ఏదో ఒకచోట చోరీలు, ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఇంతటి రద్దీ ప్రాముఖ్యత ఉన్నటువంటి రహదారిపై పోలీసుల నిఘా వైఫల్యంతోనే చోరీలు జరుగుతున్నాయని అపవాద వినిపిస్తోంది.

జరిగిన చోరీలు..

1 . 2022 సెప్టెంబర్ లో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నార్కట్ పల్లి శివారులోని పూజిత హోటల్ వద్ద ఆగింది. అందులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి 30 లక్షలు రూపాయలు చోరీ జరిగింది.

2 . 2023 జూలై నెలలో ఒడిస్సా నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సులో సుశాంత్ పాండే కు చెందిన 28 లక్షల రూపాయల బ్యాగ్ చోరీ జరిగింది..

3 . 2025 ఫిబ్రవరిలో బాపట్ల వ్యాపారి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా 23 లక్షల రూపాయల చోరీ జరిగింది.

4 . తాజాగా ఆదివారం ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆరే రవీందర్ రెడ్డి నుంచి 9 లక్షల రూపాయల బ్యాగును దుండగులు లాక్కొని వెళ్లారు.

అసలేం జరుగుతోంది..!

ఆంధ్రప్రదేశ్ , ఖమ్మం, మధిర, ఒడిస్సా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నార్కట్ పల్లి శివారులోని పూజిత హోటల్ వద్ద విరామం కోసం నిలుపుతారు. ఈ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల నుంచి చోరీలు జరుగుతున్నాయి. ఇక్కడ జరిగిన ప్రతి చోరీ లక్షల రూపాయలతో కూడుకొని ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బును తీసుకెళ్తున్నప్పుడు దుండగులకు సమాచారం ఏ విధంగా అందుతుందనే విషయం అర్థం కావడం లేదు. విరామ సమయంలో ప్రయాణికుడు కిందకి దిగిన సమయంలో మూడు చోరీలు జరిగాయి. తాజాగా జరిగిన చోరీ ఏకంగా చేతుల నుంచి లాక్కొని కారులో హైదరాబాద్ వైపు వెళ్లడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పొచ్చు. ఈ చోరీల వెనుక దాగి ఉన్న ఆశ్చర్యం ఏమిటనేది ఎవరికి అర్థం కావడం లేదు.

పోలీసుల వైఫల్యమేనా..?

వరుసగా ఒకే చోట నాలుగు చోరీలు జరగడంతో పోలీసుల తీరుపై, ఇంటెలిజెన్స్ దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాత నేరస్తులను గుర్తించడంలో, గతంలో జరిగిన చోరీల దుండగులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారనే అపవాదను మూటగట్టుకున్నారు. అదేవిధంగా రాత్రి వేళలో పకడ్బందీ గస్తీ చేయకపోవడం వల్లే ఈ ప్రాంతంలో తరచూ చోరీలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇలా చోరీలు జరుగుతున్న అ ప్రాంతం పై పోలీసుల నిఘా లేకపోవడంతోనే తరచూ చోరీలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇలా చోరీలు జరగడంతో బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు విరామం కోసం దిగాలంటేనే భయాందోళనలు చెందుతున్నారు. తాజాగా ఆదివారం జరిగిన చోరీ పోలీసులకు పెద్ద సవాలుగా మారిందని చెప్పవచ్చు. వెంటనే దుండగులను గుర్తించి రాబోయే రోజుల్లో గట్టి నిఘా ఏర్పాటు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Next Story