- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంథని సీడీపీఓ కార్యాలయంలో అవకతవకల పర్వం..?
సమాజంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించాల్సిన మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయాలు కొన్నిచోట్ల అక్రమాలకు, అవకతవకలకు నిలయాలుగా మారుతున్నాయి.

దిశ, మంథని: సమాజంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించాల్సిన మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయాలు కొన్నిచోట్ల అక్రమాలకు, అవకతవకలకు నిలయాలుగా మారుతున్నాయి. ప్రభుత్వ లక్ష్యాలను నీరుగారుస్తూ, అంగన్ వాడీ వ్యవస్థను తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్న కొందరు సిబ్బంది తీరు ఆ శాఖకే మాయని మచ్చగా మారుతోంది. తాజాగా పెద్దపల్లి జిల్లా మంథని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో చోటుచేసుకున్న పరిణామాలు ఈ తరహా బరితెగింపునకు అద్దం పడుతున్నాయి. ఏకంగా ఇద్దరు ఉద్యోగులు.. ఒకరు ఔట్ సోర్సింగ్ కాగా, మరొకరు రెగ్యులర్ జూనియర్ అసిస్టెంట్ చేసిన ఆగడాలు ఇప్పుడు ఆ శాఖలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీరి అక్రమాలపై గత ఏడాది జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లగా, తాజాగా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కేవలం తమకు కేటాయించిన పనులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. కానీ, మంథని సీడీపీఓ కార్యాలయంలో పనిచేసిన ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మాత్రం నిబంధనలను గాలికి వదిలేసి, తానే ఒక సీడీపీఓ స్థాయిలో పెత్తనం చెలాయించినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయంలో ఏ ఫైలు కదలాలన్నా, అంగన్ వాడీ కేంద్రాలకు బిల్లులు మంజూరు కావాలన్నా సదరు ఉద్యోగి కనుసన్నల్లోనే జరగాలనే అప్రకటిత నిబంధనను ఆయన అమలు చేసినట్లు సమాచారం.
గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు ఏదైనా పని నిమిత్తం ఆఫీస్ కు వస్తే వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం, అధికారులను సైతం లెక్కచేయకుండా అజమాయిషీ చేయడం పరిపాటిగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. మంథని ప్రాజెక్టు పరిధిలో పలు రికార్డుల నిర్వహణ, సరుకుల పంపిణీకి సంబంధించిన వ్యవహారాల్లో ఈ ఉద్యోగి హవానే నడిచిందని సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. అధికారం లేదు కానీ.. పెత్తనం మాత్రం నాదే అన్న చందంగా ఆయన వ్యవహరించిన తీరుపై తోటి సిబ్బంది, సూపర్ వైజర్లు ఎన్నోసార్లు అసహనం వ్యక్తం చేసినప్పటికీ ఆయన తీరులో ఏమాత్రం మార్పు రాలేదని తెలుస్తోంది. ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయనే ధీమాతోనే ఆయన ఇంతటి బరితెగింపునకు పాల్పడ్డారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
విధులకు డుమ్మా.. జూనియర్ అసిస్టెంట్ ఇష్టారాజ్యం..
ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పరిస్థితి ఇలా ఉంటే.. ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతినెలా వేల రూపాయల జీతం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్ తీరు మరోలా ఉంది. కార్యాలయానికి సక్రమంగా హాజరు కావాల్సిన ఆయన, తరచూ విధులకు డుమ్మా కొడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు రికార్డులు చెబుతున్నాయి. మంథని సీడీపీఓ కార్యాలయంలో కీలకమైన బిల్లులు, ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్లు, దైనందిన అడ్మినిస్ట్రేషన్ పనులను పర్యవేక్షించాల్సిన జూనియర్ అసిస్టెంట్.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతో ఫైళ్లు ఎక్కడికక్కడే పేరుకుపోయాయి.
అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణకు సంబంధించిన అత్యవసర నివేదికలు పంపడంలో, సిబ్బంది సమస్యలను పరిష్కరించడంలో ఈ జూనియర్ అసిస్టెంట్ నిర్లక్ష్యం వల్ల తీవ్ర జాప్యం జరిగేదని తోటి ఉద్యోగులు వాపోతున్నారు. అధికారులు మందలించినా కనీస స్పందన కరువైందని, తన ఇష్టం వచ్చిన రోజు ఆఫీస్ కు రావడం, మిగతా రోజుల్లో కనీసం సమాచారం కూడా లేకుండా గైర్హాజరు కావడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా మారిందని ఆరోపణలు ఉన్నాయి.
కదం తొక్కిన సూపర్ వైజర్లు.. జిల్లా ఆఫీస్ కు ఫిర్యాదుల వెల్లువ..
ఈ ఇద్దరు ఉద్యోగుల ప్రవర్తన, అక్రమాలతో మంథని సీడీపీఓ కార్యాలయంలో పాలన పూర్తిగా గాడి తప్పింది. వీరి వేధింపులు, నిర్లక్ష్యం శృతిమించడంతో కార్యాలయంలోని సూపర్ వైజర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. క్షేత్రస్థాయిలో అంగన్ వాడీ కేంద్రాలను పర్యవేక్షించి, లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలు అందేలా చూసే క్రమంలో వీరికి ఆఫీస్ నుంచి కనీస సహకారం అందకపోగా, అవమానాలు ఎదురయ్యాయి. దీంతో విసుగెత్తిన సూపర్ వైజర్లు, అంగన్వాడీ సిబ్బంది ఏకమై వీరి అక్రమాలపై గత ఏడాది పెద్దపల్లి జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. ఆధారాలతో సహా సదరు ఉద్యోగుల ఆగడాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
గతంలో ఈ ఫిర్యాదులపై స్థానిక స్థాయిలో కొంత తూతూ మంత్రంగా విచారణ జరిగిందనే విమర్శలు వచ్చాయి. అయితే, సూపర్ వైజర్ల ఫిర్యాదుల్లోని తీవ్రతను, మంథని ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను సునిశితంగా పరిశీలించిన మహిళా శిశు సంక్షేమ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ తాజాగా ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. కార్యాలయంలో ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పెత్తనం ఏమిటని, అలాగే జూనియర్ అసిస్టెంట్ విధులకు ఎలా గైర్హాజరవుతారని ప్రశ్నిస్తూ, ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయికి వెళ్లి, ఫిర్యాదుదారులు అయిన సూపర్ వైజర్ల వాంగ్మూలాలను నమోదు చేసి, పక్కాగా నివేదిక సమర్పించాలని ఆర్జేడీ స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్..
ఐసీడీఎస్ వంటి సున్నితమైన శాఖలో పేద గర్భిణులు, పిల్లల కోసం కేటాయించిన నిధులను, విధులను పక్కదారి పట్టించేలా వ్యవహరించిన సదరు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేవలం బదిలీలు లేదా మెమోలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా, అవినీతికి, అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే విధుల నుంచి తొలగించాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అంగన్ వాడీ సంఘాల నాయకులు కోరుతున్నారు. ఆర్జేడీ ఆదేశాలతో మొదలైన ఈ తాజా విచారణ పారదర్శకంగా జరగాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిజాలను వెలికితీయాలని మంథని ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు. ఒకవేళ విచారణలో ఏమాత్రం పక్షపాతం చూపినా ఉన్నత స్థాయిలో పోరాటాలు చేస్తామని అంగన్ వాడీ యూనియన్లు హెచ్చరిస్తున్నాయి. ఏది ఏమైనా, మంథని సీడీపీఓ కార్యాలయంలో ఈ 'ఇద్దరు' ఉద్యోగుల ఉదంతం ఇప్పుడు ఐసీడీఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాబోయే రోజుల్లో విచారణ నివేదిక ఆధారంగా ఎలాంటి సంచలన నిర్ణయాలు వెలువడుతాయో వేచి చూడాలి.ఇదే విషయం పై పెద్దపల్లి జిల్లా డిడబ్యూఓ అధికారినికి దిశ సంప్రదించగా అందుబాటులో రాలేదు. మంథని సీడీపీఓ అడుగగా విచారణకు తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని సమాధానం చెప్పారు.






