అక్రమ కేసు వ్యవహారంపై వెల్లువెత్తుతున్న అనుమానాలు

by Jakkula.Mamatha |

కరీంనగర్ జిల్లాలోని ఓ రిజర్వుడు నియోజకవర్గంలో చట్టం దారి తప్పుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అక్రమ కేసు వ్యవహారంపై వెల్లువెత్తుతున్న అనుమానాలు
X

దిశ, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లాలోని ఓ రిజర్వుడు నియోజకవర్గంలో చట్టం దారి తప్పుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్టాలను అమలు చేయాల్సిన అధికారులు అధికారానికి దాసోహం అన్నట్టుగా వ్యవహరిస్తుండటంతో పాలకులు సామాన్యులను అణగదొక్కేందుకు, వారిపై దౌర్జన్యాలకు పాల్పడేందుకు చట్టాన్ని అస్త్రంగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాలకుల నిరంకుశ వైఖరికి గురై కొంతమంది ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఓ ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడి వేధింపులు తట్టుకోలేక, సదరు ఎమ్మెల్యేకు తన సమస్యను చెప్పుకునేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లిన బాధితుడు అగ్నికి ఆహుతై ప్రాణాలు కోల్పోవడంతో.. ఇక్కడ చట్టం దారితప్పి అక్రమార్కులకు అస్త్రంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సామాన్యుడి ప్రాణం తీసిన అక్రమ కేసు..

నిజానిజాలు తెలుసుకోకుండా ఓ వ్యక్తిపై పోలీసులు నమోదు చేసిన కేసు ఓ సామాన్యుడి ప్రాణాలు తీసే పరిస్థితికి దారితీసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. న్యాయం, ధర్మం వైపు నిలవాల్సిన చట్టాన్ని ఏకపక్షంగా అమలు చేస్తూ అధికారులు అక్రమ కేసు నమోదు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ ఘటనపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాధారణంగా బాధితులు ఫిర్యాదు చేస్తే విచారణ పేరుతో రోజులు తరబడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకునే పోలీసులు ఓ సామాన్యుడి పై కేసు నమోదు చేసేందుకు చూపించిన వేగం పోలీసు వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఇక్కడ మరో విచిత్రమైన అంశం ఏమిటంటే.. వివాదం జరిగిన సమయంలో అక్కడ లేని వ్యక్తి, ఆ గొడవతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి ఘటనలోకి రావడం, ప్రత్యేక చట్టాన్ని ప్రయోగించి కేసు నమోదు చేయడం క్షణాల్లో జరిగిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో భయాందోళనకు గురైన బాధితుడు తన గోడును చెప్పుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన జిల్లాలో చట్టాల అమలు తీరుకు అద్దం పడుతోందని, అధికార పార్టీ నేతల తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోందని పలువురు అంటున్నారు.

తప్పు నుంచి తప్పించుకునేందుకేనా?

ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన నాయకులు ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి వారి పాలిట శత్రువులుగా మారడం వివాదాస్పదంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా తమ తప్పుల నుంచి తప్పించుకునేందుకు చట్టాలను చుట్టాలుగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీ నేతల వేధింపుల కారణంగానే బాధితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడా? లేక అధికార పార్టీ అనే అహంతో ఏదైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అంపశయ్యపై ఉన్న బాధితుడిని కాపాడేందుకు చేయాల్సిన ప్రయత్నాలను పక్కన పెట్టి, బాధితుడి ప్రాణాలు పోతే కేసు నుంచి ఎలా బయటపడాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం దమననీతికి అద్దం పడుతోందని పలువురు విమర్శిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన అధికారులు సైతం మానవత్వాన్ని విస్మరిస్తున్నారనే ఆరోపణలు బాధిత కుటుంబ సభ్యుల్లో ఆగ్రహానికి కారణమవుతున్నాయి.

పోరాడి ప్రాణాలు విడిచిన బాధితుడు..

మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అగ్నికి ఆహుతైన గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త బేతెల్లి రాజేందర్ రెడ్డి ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజేందర్ రెడ్డిని కాపాడేందుకు వైద్యులు చివరి వరకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన మృతితో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. కాగా, రాజేందర్ రెడ్డి మృతికి కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగత సహాయకుడు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.

సీఎంకు బాధితుల ఫిర్యాదు..

మానకొండూరు ఎమ్మెల్యే వ్యక్తిగత పీఏ ఆగడాలతో ప్రాణాలు కోల్పోయిన బేతెల్లి రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు న్యాయం కోసం సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు వేధింపులకు గురిచేసి అక్రమ కేసులు నమోదు చేసి తన భర్త ప్రాణాలు తీసిన వారిపై చట్టపర చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని మృతుడి భార్య సీఎంకు విజ్ఞప్తి చేశారు. స్థానిక అధికారులు ఎవరు తమ గోడు విన లేదని ప్రాణాలు పోతున్నాయి.. పట్టించుకోండి అంటూ వేడుకున్న ఎవరు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసిన బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం చేయకపోగా కనీసం మా ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story