సైబర్ మోసగాళ్ల వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. రూ.81 లక్షలు ఫట్

by Muthe.Rajitha |

సైబర్ మోసగాళ్లకు మరో సాఫ్ట్వేర్ బలయ్యాడు.

సైబర్ మోసగాళ్ల వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. రూ.81 లక్షలు ఫట్
X

దిశ, వెబ్ డెస్క్ : సైబర్ మోసగాళ్లకు మరో సాఫ్ట్వేర్ బలయ్యాడు. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఒక యువకుడిని ప్రేమ పేరుతో బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు, ఏకంగా రూ. 81.67 లక్షలు కాజేసిన ఘటన కడప జిల్లా బద్వేలులో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. బద్వేలుకు చెందిన ఊరుపిండి అశోక్ చెన్నైలోని ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో ఒక యువతి పేరుతో ఉన్న ఫేక్ ప్రొఫైల్ నుండి అశోక్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. బాధితుడి నమ్మకాన్ని సంపాదించిన సదరు "అజ్ఞాత యువతి", తన వ్యక్తిగత అవసరాల కని, కుటుంబ సమస్యలు అని రకరకాల కారణాలు చెబుతూ అశోక్ నుండి డబ్బులు తీసుకోవడం ప్రారంభించింది.

రూ. 81 లక్షల దోపిడీ

ప్రేమలో మునిగిపోయిన అశోక్, అవతలి వ్యక్తి అడిగినప్పుడల్లా భారీ మొత్తంలో డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేస్తూ వచ్చాడు. ఇలా పలు విడతలుగా మొత్తం రూ.81.67 లక్షలను ఆ ఫేక్ అకౌంట్ నిర్వాహకులకు సమర్పించుకున్నాడు. అయితే, ఎన్ని లక్షలు ఇచ్చినా మళ్ళీ మళ్ళీ డబ్బు కావాలని వేధిస్తుండటంతో అనుమానం వచ్చిన అశోక్, చివరకు తాను మోసపోయానని గ్రహించి బద్వేలు పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. "ప్రస్తుతం కేసును సైబర్ సెల్ అధికారులకు బదిలీ చేశాం. నిందితులు ఎక్కడి నుండి ఈ నెట్‌వర్క్ నడుపుతున్నారో గుర్తిస్తున్నాం. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో స్నేహం చేసేటప్పుడు, ముఖ్యంగా డబ్బు వ్యవహారాల్లో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి" అని హెచ్చరించారు.

Next Story