అత్యంత ఖరీదైన హౌసింగ్ మార్కెట్‌గా రెండోస్థానంలో హైదరాబాద్!

by Dishanational1 |
అత్యంత ఖరీదైన హౌసింగ్ మార్కెట్‌గా రెండోస్థానంలో హైదరాబాద్!
X

న్యూఢిల్లీ: పెరుగుతున్న వడ్డీ రేట్లు దేశంలోని స్థిరాస్థి రంగంపై ప్రభావం చూపడం ప్రారంభించాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఇటీవల రెపో రేటును రెండు దఫాల్లో 90 బెసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఇటీవల గృహ రుణాల రేట్లు పెరగడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బడ్జెట్ ఇళ్ల కొనుగోలు సామర్థ్యం నెమ్మదిస్తోంది. 2022, మొదటి ఆరు నెలలకు సంబంధించి నైట్‌ఫ్రాంక్ వివరాల ప్రకారం, దేశంలో అత్యంత ఖరీదైన 8 నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఆర్థిక రాజధాని ముంబై అత్యంత ఖరీదైన హౌసింగ్ మార్కెట్‌గా మొదటిస్థానంలో ఉంది.

మూడో స్థానంలో ఢిల్లీ నిలిచింది. హైదరాబాద్‌లో ప్రజల ఇళ్ల కొనుగోలు సామర్థ్యం 2010లో 47 శాతం ఉండగా, 2019 నాటికి 33 శాతంగా ఉంది. ఆ తర్వాత 2020లో ఇది 31 శాతానికి చేరుకుంది. ఇక, మిగిలిన స్థానాల్లో బెంగళూరు, కోల్‌కతా, పూణె, చెన్నై, అహ్మదాబాద్ నగరాలు ఉన్నాయి. దీని ప్రకారం, దేశీయ ప్రధాన ఎనిమిది నగరాల్లో అహ్మదాబాద్ అత్యంత అనువైన బడ్జెట్ ఇళ్ల మార్కెట్‌గా నిలిచింది. సగటున కుటుంబ ఆదాయం, ఈఎంఐ ఆధారంగా ఈ గణాంకాలను రూపొందించినట్టు ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఓ ప్రకటనలో వెల్లడించింది.


Next Story