భగ్గుమంటున్న కూరగాయల ధరలు.. నెల రోజుల్లోనే రెండింతలు!

by Jakkula.Mamatha |

నిత్యావసరాల్లో అత్యంత ముఖ్యమైన కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

భగ్గుమంటున్న కూరగాయల ధరలు.. నెల రోజుల్లోనే రెండింతలు!
X

దిశ, గోదావరిఖని: నిత్యావసరాల్లో అత్యంత ముఖ్యమైన కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్దపల్లి జిల్లా కోదాడ కని రామన్నపాడు శ్రామిక ప్రాంతంలో ఒకప్పుడు వారానికి సరిపడా కూరగాయలు తక్కువ ఖర్చుతో కొనుగోలు చేసిన కుటుంబాలు, ప్రస్తుతం ధరలు పెరగడంతో రెండింతల డబ్బులు పెట్టి ఆలోచించి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. టమాటా, ఉల్లి, పచ్చిమిర్చి, ఆకుకూరలు, వంకాయ, బెండకాయ, బీన్స్ వంటి కూరగాయల ధరలు పెరగడంతో మధ్యతరగతి, పేద కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై అదనపు భారం పడుతోంది. రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయల ధరలు ఒకే సరి పెరగడంతో పేదవాడి ఇంట్లో ధరల మంట. సామాన్యుడి వంటింటిపై భారం పడటంతో ఎంత ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నెల రోజుల్లోనే రెండింతల కూరగాయల రేట్లు మహిళలు ఆవేదనను వ్యక్తం చేసేసారు.

కూరలో కూరగాయలు తగ్గుతున్నాయ్.. ఖర్చులు పెరుగుతున్నాయ్..

గతంలో వారానికి ఒకసారి పెద్ద మొత్తంలో కూరగాయలు తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు అదే డబ్బుతో సగం కూరగాయలు కూడా రావడం లేదు. పిల్లలకు పౌష్టికాహారం అందించడం కష్టంగా మారుతోంది అని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల ధరలు పెరగడంతో కొందరు కుటుంబాలు ఖర్చు తగ్గించుకునేందుకు ఖరీదైన కూరగాయలు తగ్గించి, తక్కువ ధరలో లభించే వాటి వైపు మొగ్గు చూపుతున్నారు.

రైతుకు లాభం ఎంత.. వినియోగదారుడికి భారం ఎంత..

మార్కెట్‌లో ధరలు పెరిగినా రైతులకు పూర్తిస్థాయిలో ప్రయోజనం అందడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రవాణా ఖర్చులు, విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు పెరగడం వల్ల రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యవర్తుల వ్యవస్థ కారణంగా రైతు, వినియోగదారుడి మధ్య ధరల్లో వ్యత్యాసం పెరుగుతోందని కొనుగోలుదారులు పలువురు చెబుతున్నారు.

ధరల నియంత్రణకు చర్యలు అవసరం..

కూరగాయల ధరలను నియంత్రించేందుకు మార్కెట్ పర్యవేక్షణ పెంచాలని, రైతు బజార్లను బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. నిల్వలు, సరఫరా వ్యవస్థపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

సామాన్యుడిపై భారం..

ఆదాయం పెరగడం లేదు.. కానీ ప్రతిరోజూ ఖర్చులు పెరుగుతున్నాయి. నిత్యావసరాల ధరలు నియంత్రించకపోతే సాధారణ కుటుంబాల పరిస్థితి మరింత భారంగా మారుతుంది అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల ధరల పెరుగుదల కేవలం మార్కెట్ సమస్య కాదు.. ఇది ప్రతి కుటుంబ వంటింటిని ప్రభావితం చేస్తున్న ఆర్థిక సమస్యగా మారింది. ధరల నియంత్రణకు ప్రభుత్వం, అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

నిత్యం వాడే కూరగాయల ధరలు..

టమోటా రూ.80

ఉల్లిపాయ రూ.38

బంగాళాదుంప రూ.39

పచ్చిమిర్చి రూ.80

బెండకాయ రూ.75

వంకాయ రూ.80

సొరకాయ రూ.55

బీరకాయ రూ.90

కాకరకాయ రూ.80

దొండకాయ రూ.75

క్యారెట్ రూ.86

బీట్‌రూట్ రూ.56

ముల్లంగి రూ.45

మునగకాయ రూ.100

గత నెలరోజుల నుంచి అన్ని కూరగాయల పై 50 శాతం రేట్లు అమాంతం పెరుగుతూ వస్తున్నాయి.

కూరగాయల రేట్లు రెండింతలు పెరిగాయి: గుర్రం రమేష్ బాబు

నెల రోజుల్లోనే కూరగాయల రేట్లు రెండింతలు పెరిగాయి. వారానికి సరిపోయే కూరగాయలు తీసుకోవాలంటే సుమారు 500 ఖర్చవుతుంది. సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనాలంటే ఇబ్బందిగానే ఉంది.

Next Story