- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్‌కు సిట్ వేధింపులు.. రేపు రాష్ట్రవ్యాప్త బీఆర్ఎస్ ఆందోళనలకు కేటీఆర్ పిలుపు
రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారంలో ఇప్పటికే అధికారులతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలను విచారించిన సిట్ అధికారులు తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారంలో ఇప్పటికే అధికారులతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలను విచారించిన సిట్ అధికారులు తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ నేతులు, న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కేసీఆర్ హైదరాబాద్ లోని తన నివాసంలో సిట్ విచారణకు హజరవుతానని అధికారులకు సూచించారు.
ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని ఆరోపిస్తూ.. రేపు (ఆదివారం) రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసనలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ నోటీసులు జారీ చేశారని మండిపడ్డ కేటీఆర్, ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రంలోని 12 వేలకు పైగా గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.
ప్రతి మున్సిపల్ వార్డు, నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించాలని, నల్ల జెండాలతో నిరసన తెలపాలని కేటీఆర్ సూచించారు. అలాగే నగరాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో ధర్నాలు, రాస్తారోకోల ద్వారా ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ ఆందోళనల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇతర బీఆర్ఎస్ సీనియర్ నేతలు ప్రత్యక్షంగా పాల్గొని విజయవంతం చేయాలని కేటీఆర్ సూచించారు.
అలాగే ఈ నిరసన కార్యక్రమాలన్నీ అత్యంత శాంతియుతంగా జరగాలని, ఎక్కడ పోలీసులతో ఘర్షణలకు దిగవద్దని పార్టీ శ్రేణులకు కేటీఆర్ స్పష్టమైన సూచనలు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనను గట్టిగా వినిపించాలని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ విచారణకు అంగీకరించిన తరుణంలోనే పార్టీ క్యాడర్ ఈ స్థాయిలో రోడ్లపైకి రానుండటంతో రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉంది.






