ఎస్‌ఐఆర్ డిజిటైజేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

by Jakkula.Mamatha |

ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్–2026) కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ (ఆన్‌లైన్) ప్రక్రియను ఈ నెల 20వ తేదీలోపు పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు.

ఎస్‌ఐఆర్ డిజిటైజేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్
X

దిశ, అడ్డాకుల: ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్–2026) కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ (ఆన్‌లైన్) ప్రక్రియను ఈ నెల 20వ తేదీలోపు పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం అడ్డాకుల, మూసాపేట మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అడ్డాకుల మండలంలోని కందూరు గ్రామం, మూసాపేట మండలంలోని కొమ్మిరెడ్డిపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ నమోదు ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఇప్పటివరకు స్వీకరించిన అన్ని ఎన్యూమరేషన్ ఫారాలను నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసి, డిజిటైజేషన్ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆయన సూచించారు. అలాగే, ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని ఓటర్లు వెంటనే తమ సంబంధిత బీఎల్‌ఓలను సంప్రదించి ఫారాలను సమర్పించాలని కోరారు. ఫారాలు సమర్పించని వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించబడే అవకాశం ఉన్నందున, అర్హత కలిగిన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారాన్ని బీఎల్‌ఓలకు అందజేయాలని సూచించారు. ఈ తనిఖీలలో ఆయా మండలాల తహసీల్దార్లు, బీఎల్‌ఓ సూపర్వైజర్లు, బీఎల్‌ఓలు, గ్రామ సర్పంచులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story