సుస్థిర మైనింగ్లో సింగరేణి మరో మైలురాయి

by Batti.Sumithra |

బొగ్గు గనుల నిర్వహణలో మాత్రమే కాకుండా, గనుల మూసివేత అనంతరం పర్యావరణ పరిరక్షణలోనూ అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్న సంస్థగా సింగరేణి మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.

సుస్థిర మైనింగ్లో సింగరేణి మరో మైలురాయి
X

దిశ, కొత్తగూడెం సింగరేణి : బొగ్గు గనుల నిర్వహణలో మాత్రమే కాకుండా, గనుల మూసివేత అనంతరం పర్యావరణ పరిరక్షణలోనూ అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్న సంస్థగా సింగరేణి మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ-2 ఓపెన్కాస్ట్ గనిని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా మూసివేసినందుకు గుర్తింపుగా, గని ప్రారంభ సమయంలో డిపాజిట్ చేసిన సుమారు రూ.40 కోట్ల సొమ్మును వడ్డీతో సహా కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ (సీసీఓ) సింగరేణికి తిరిగి చెల్లించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు దిశానిర్దేశంలో సింగరేణి సంస్థలో తీసుకుంటున్న పర్యావరణహిత చర్యలకు లభించిన గుర్తింపుగా భావించవచ్చు.

గనుల ప్రారంభం నుంచి మూసివేత వరకు అమలు చేయాల్సిన మైన్ క్లోజర్ ప్లాన్, పర్యావరణ పరిరక్షణ చర్యలు, భూ సంరక్షణ, పునరుద్ధరణ కార్యక్రమాలు తదితర అంశాలను సింగరేణి సంస్థ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా కచ్చితంగా అమలు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్, గని ప్రారంభ సమయంలో డిపాజిట్ చేసిన నిధులను ఇటీవల వడ్డీతో సహా తిరిగి విడుదల చేసింది. డోర్లీ-2 గని మూసివేత ప్రక్రియలో సింగరేణి చూపిన బాధ్యతాయుత వైఖరి, పర్యావరణ హిత చర్యలు, పారదర్శకత, ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసిన తీరుకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. గనుల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇస్తూ సుస్థిర మైనింగ్ విధానాలను అమలు చేస్తున్న సింగరేణి సంస్థకు ఇది మరో విశిష్ట గుర్తింపుగా భావిస్తున్నారు.

అప్పటికే సింగరేణి సంస్థ దశల వారీగా ఒప్పందంలోని అంశాలను అమలు జరుపుతూ వచ్చింది. ఈ పనులు ఇచ్చిన హామీ ప్రకారం పూర్తి అయినాయా ? లేదా ? అనే అంశాన్ని ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శిబ్ పూర్ (పశ్చిమబెంగాల్) ద్వారా జులై, 2024లో నిర్వహించారు. ఆడిట్లో అన్ని సక్రమంగా జరిగాయని సింగరేణి సంస్థ నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు జరిపిందని పేర్కొన్నారు. ఫలితంగా ఏడేళ్ల క్రితం డిపాజిట్ చేసిన సొమ్మును వడ్డీతో సహా కలిపి తిరిగి సింగరేణి సంస్థకు చెల్లిస్తున్నట్లు డిప్యూటీ అసిస్టెంట్ కోల్ కంట్రోలర్ ఆకాష్ శివ హరే తమ లేఖలో ఇటీవల పేర్కొన్నారు. మొత్తం 40 కోట్లు చెల్లించాల్సి ఉండగా దీనిలో 90% డిపాజిట్ సొమ్ము 36.63 కోట్ల రూపాయలను చెల్లిస్తున్నామని, మిగిలిన పది శాతం జస్ట్ ట్రాన్సిషన్ ప్రొవిజన్స్ అంశాలు పరిశీలించిన తర్వాత చెల్లిస్తామని పేర్కొన్నారు. అంటే దాదాపు 40 కోట్ల రూపాయలు తిరిగి సింగరేణి సంస్థ ఖాతాలో పడుతున్నాయి. దీనిపై సింగరేణి యాజమాన్యం తన సంతృప్తిని వ్యక్తం చేసింది.

దీనిపై డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సింగరేణి సంస్థ చిత్తశుద్ధితో చేపడుతున్న గని మూసివేత చర్యలకు నిదర్శనంగా కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారు డిపాజిట్ సొమ్మును తిరిగి కంపెనీకి చెల్లించారని, గతంలో ఒక భూగర్భ గనికి (ఆర్కే-8 ఇంక్లైన్, శ్రీరాంపూర్) సంబంధించి రూ.4 కోట్ల డిపాజిట్ ను తిరిగి ఇదే విధంగా చెల్లించారని పేర్కొన్నారు. మూసివేత దశలో ఉన్న మరికొన్ని గనుల్లోనూ ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు పటిష్ట పర్యావరణ హిత చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. త్వరలో మరికొన్ని మూతబడిన గనులకు సంబంధించిన పనులు పూర్తి చేసి ఉన్నందున వాటి డిపాజిట్లు సింగరేణికి అందనున్నాయని పేర్కొన్నారు. డోర్లీ-1 గనికి సంబంధించి కూడా తనిఖీలు చివరి దశలో ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి మరో రూ.60 కోట్లకు పైగా డిపాజిట్లు తిరిగి వచ్చే అవకాశం ఉందన్నారు.

Next Story