- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలా..?: హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్ మెట్రో రైలు స్టేషన్ల కింద పాదచారుల కోసం కేటాయించిన ఫుట్‌పాత్‌లు క్రమంగా వాణిజ్య అడ్డాలుగా మారుతుండటంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది....

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రో రైలు స్టేషన్ల కింద పాదచారుల కోసం కేటాయించిన ఫుట్‌పాత్‌లు క్రమంగా వాణిజ్య అడ్డాలుగా మారుతుండటంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరంలో పాదచారుల కోసం ఉద్దేశించిన ఫుట్‌పాత్‌ల ను నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాలకు లీజుకివ్వడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. మెట్రో స్టేషన్ల కింద స్టాళ్ల ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్,హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులను ఆదేశించింది.
నగరంలోని వివిధ మెట్రో స్టేషన్ల కింద ఉన్న ఫుట్‌పాత్‌లను వాణిజ్యపరమైన స్టాళ్లకు లీజుకివ్వడం వల్ల పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, ఇది చట్టవిరుద్ధమని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ సందర్భంగా న్యాయస్థానం అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అసలు పాదచారుల కోసం కేటాయించిన స్థలాలను స్టాళ్లకు లీజుకు ఇచ్చే అధికారం ఎవరిచ్చారని అధికారులను నిలదీసింది. ప్రజల రాకపోకలకు అత్యంత కీలకమైన, సున్నితమైన ఈ స్థలాలను వ్యాపార అవసరాలకు వినియోగించడం ఏమాత్రం సమంజసం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది.
పాదచారుల భద్రత మాటేమిటి..
మెట్రో స్టేషన్ల కింద నిరంతరం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి స్టాళ్ల ఏర్పాటు వల్ల పాదచారులు రోడ్డుపైకి రావాల్సి వస్తోందని, తద్వారా వారి భద్రత ప్రమాదంలో పడుతోందని కోర్టు అభిప్రాయపడింది. బహిరంగ ప్రదేశాలను, ముఖ్యంగా ఫుట్‌పాత్‌ల ను ఆదాయ వనరులుగా చూడటం సరికాదని హితవు పలికింది. ప్రభుత్వ సంస్థలు ప్రజల సౌకర్యార్థం పనిచేయాలి తప్ప, ఉన్న దారిని కూడా వ్యాపారాలకు కేటాయించి సామాన్యులను ఇబ్బందులకు గురిచేయకూడదని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో భద్రతా ప్రమాణాలను, నిబంధనలను ఎలా విస్మరిస్తారని అధికారులను ప్రశ్నించింది.
పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలి..
మెట్రో ఫుట్‌పాత్‌లపై స్టాళ్ల ఏర్పాటుకు సంబంధించి గతంలో వచ్చిన ఫిర్యాదులు ఎన్ని.. వాటిపై జీహెచ్‌ఎంసీ, మెట్రో అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు.. అనే అంశాలపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. నివేదిక సమర్పించేందుకు అధికారులకు గడువు ఇస్తూనే, తదుపరి విచారణలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా ఫుట్‌పాత్‌ల
ఆక్రమణలు, లీజులు ఉంటే న్యాయస్థానం ఊరుకోదని ఈ సందర్భంగా హెచ్చరించింది. నగరవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మెట్రో ఫుట్‌పాత్‌లు వ్యాపార మయంగా మారిన నేపథ్యంలో హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.






