బెంగాల్ గడ్డపై 'శ్యామా ప్రసాద్ ముఖర్జీ' కల సాకారమైంది.. అమిత్ షా ఉద్వేగభరిత ప్రసంగం

by Malleboina Mahesh |

కోల్‌కతాలో బీజేపీ విజయోత్సవ సభలో అమిత్ షా ప్రసంగించారు. పరాయి భావజాలాల నుండి బెంగాల్‌కు విముక్తి లభించిందని, సువేందు అధికారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆయన స్పష్టం చేశారు.

బెంగాల్ గడ్డపై శ్యామా ప్రసాద్ ముఖర్జీ కల సాకారమైంది.. అమిత్ షా ఉద్వేగభరిత ప్రసంగం
X

దిశ, వెబ్ డెస్క్: బెంగాల్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సువేందు అధికారి (suavendhu adhikari)ని ఎన్నుకున్నట్లు.. బెంగాల్ శాసనసభాపక్ష సమావేశం తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అనంతరం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) కోల్‌కతా వేదికగా ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ (Shyama Prasad Mukherjee) జన్మస్థలమైన బెంగాల్‌లో 1950 తర్వాత ఆయన భావజాలం తో కూడిన ప్రభుత్వం కొలువుదీరడం ఒక చారిత్రక అవసరమని ఆయన పేర్కొన్నారు.

గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు బీజేపీ (BJP) జెండా రెపరెపలాడుతోందని, ఆర్టికల్ 370 రద్దు తర్వాత కార్యకర్తలు ఆశించినట్లుగా బెంగాల్ గడ్డపై బీజేపీ జెండాను ఎగురవేయడం ద్వారా వందేళ్ల సైద్ధాంతిక ప్రయాణం ఒక మైలురాయిని చేరుకుందని ఆయన అన్నారు. కమ్యూనిస్టుల కాలం నుంచి కొనసాగుతున్న భయానక వాతావరణాన్ని, మమతా బెనర్జీ హయాంలో మరింత దారుణంగా మారిన పరిస్థితులను ఎదిరించి, నరేంద్ర మోదీ నాయకత్వంపై నమ్మకంతో భారీ విజయాన్ని అందించిన బెంగాల్ ప్రజలకు ఆయన చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు.

బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాలను పరాయి భావజాలాల నుండి విముక్తి చేసి.. రామకృష్ణ పరమహంస, వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు కలలుగన్న "సోనార్ బంగ్లా" (బంగారు బెంగాల్) నిర్మాణానికి ఈ విజయం బాటలు వేసిందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. "ఎక్కడైతే మనస్సు భయం లేకుండా ఉంటుందో, ఎక్కడైతే తల గర్వంతో నిటారుగా ఉంటుందో.. అటువంటి బెంగాల్ వైపు అడుగులు పడుతున్నాయి" అని ఠాగూర్ కవితా పంక్తులను ఆయన గుర్తుచేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రజా తీర్పుకు కట్టుబడి అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇదే క్రమంలో, ఈ వేడుకలకు కేంద్ర బిందువుగా ఉన్న సువేందు అధికారిని బెంగాల్ కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ ఆయన పేరును అధికారికంగా ఖరారు చేశారు.

Next Story