కాంగ్రెస్ లో ‘షోకాజ్’ కలకలం

by Batti.Sumithra |

కామారెడ్డిలో అధికార కాంగ్రెస్ పార్టీలో నేతలకు షోకాజ్ నోటీసుల పర్వం మొదలైంది. దీంతో ఆ పార్టీలో కలవరం మొదలైంది.

కాంగ్రెస్ లో ‘షోకాజ్’ కలకలం
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డిలో అధికార కాంగ్రెస్ పార్టీలో నేతలకు షోకాజ్ నోటీసుల పర్వం మొదలైంది. దీంతో ఆ పార్టీలో కలవరం మొదలైంది. ఆ పార్టీకి చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి ఇటీవల పార్టీ అధిష్టానంతో పాటు క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేయగా అతను క్రమశిక్షణ కమిటీ ముందు సంజాయిషీ కూడా ఇచ్చుకున్నారు. కాగా తాజాగా మాజీ మంత్రి, సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి కూడా పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో పార్టీ వర్గాల్లో ఏం జరుగుతుందోననే కలవరం మొదలైంది.

క్రమశిక్షణ తప్పితే చర్యలకు సిఫారసు

పార్టీ నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఎట్టిపరిస్థితుల్లో ఊరుకునేది లేదని అధిష్టానంతో పాటు క్రమశిక్షణ కమిటీ సంబంధిత నేతలకు షోకాజ్ నోటీసులు జారీచేసి వారి నుంచి వివరణ కోరుతోంది. పార్టీకి చెందిన వ్యక్తులతో పాటు మహిళలను కించపరిచేలా ఎవరు మాట్లాడినా వారిపై అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. తాజాగా మాజీ మంత్రి, సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు అయిన షబ్బీర్ అలీకి సైతం నోటీసులు జారీ అయ్యాయి. కాగా ఈ వివాదం ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందోనని అధికార పార్టీతో పాటు ఇతర పార్టీలోనూ చర్చ జరుగుతోంది.

మహిళ పై అసభ్యకర పోస్టులు.. వివాదాస్పద వ్యాఖ్యలే కారణం

ఇటీవల మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు వచ్చాయి. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పోస్టుల వెనక షబ్బీర్ అలీ కొడుకు, ఆయన అన్న కొడుకు, మరికొందరు ఉన్నారని ఇందుప్రియ ఆరోపిస్తూ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆమె షబ్బీర్ అలీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి తోడు "టీపీసీసీ పదవులు అమ్ముకుంటుంది" అంటూ షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు, మహిళల పట్ల వివాదాస్పదంగా మాట్లాడిన తీరును పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. సదరు సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా మహిళా నేత పట్ల ఆయన వ్యవహరించిన తీరు, మాట్లాడిన మాటలు సరికావని పార్టీ అంతర్గత సంభాషణల్లోనే కాకుండా, బహిరంగంగానూ విమర్శలు వస్తున్నాయి.

ఇటీవల చంద్రశేఖర్‌రెడ్డికి కూడా

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీపై చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం తీవ్రంగా స్పందించింది. ఈ సందర్భంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన శుక్రవారం క్రమశిక్షణ కమిటీ ముందు తన వివరణ కూడా ఇచ్చుకున్నారు. ప్రస్తుతం షబ్బీర్ ఆలీకి సైతం నోటీసులు జారీ కావడం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది.

కార్యకర్తల్లో మొదలైన ఆందోళన

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో మొదలైన షోకాజ్ నోటీసుల పర్వంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలతో ఇప్పటికే సతమతమవుతున్న ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం జరుగుతున్న షోకాజ్ నోటీసుల పర్వంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. అధికారంలో ఉండి కూడా అంతర్గత కుమ్ములాటలతో పార్టీ పరువు బజారున పడుతోందని సీనియర్ కార్యకర్తలు వాపోతున్నారు. పార్టీలో కొనసాగడం పై ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కామారెడ్డి కాంగ్రెస్ రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీయడం, సీనియర్ నేతతో జూనియర్ నాయకుడు డీ అంటే ఢీ అని ముందుకు సాగుతుండటం అధిష్టానానికి తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. ఈ క్రమంలో షబ్బీర్ అలీ ఇచ్చుకునే వివరణ ఎలా ఉండబోతుంది అనే చర్చ సాగుతోంది.

Next Story