కార్యదర్శుల కొరత.. పంచాయతీల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం

by Ratna Kumari |

గ్రామీణ ప్రాంతాల పరిపాలనకు మూలస్తంభాలైన గ్రామ పంచాయతీ కార్యదర్శుల కొరత పినపాక మండలంలో తీవ్ర సమస్యగా మారింది.

కార్యదర్శుల కొరత.. పంచాయతీల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం
X

దిశ, పినపాక : గ్రామీణ ప్రాంతాల పరిపాలనకు మూలస్తంభాలైన గ్రామ పంచాయతీ కార్యదర్శుల కొరత పినపాక మండలంలో తీవ్ర సమస్యగా మారింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పారిశుధ్య నిర్వహణ, పన్నుల వసూళ్లు, గ్రామ రికార్డుల నిర్వహణ, గ్రామసభలు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ వంటి కీలక బాధ్యతలు కార్యదర్శులపై ఉండగా, సిబ్బంది కొరతతో గ్రామాల అభివృద్ధి పనులు మందగిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

23 పంచాయతీలకు 12 మంది కార్యదర్శులే..

పినపాక మండలంలో మొత్తం 23 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రస్తుతం కేవలం 12 మంది కార్యదర్శులే విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 11 పంచాయతీలకు శాశ్వత కార్యదర్శులు లేకపోవడంతో ఒక్కో కార్యదర్శి రెండు నుంచి మూడు గ్రామాలకు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో వారు అన్ని గ్రామాలకు సమయానికి చేరుకోవడం సాధ్యం కావడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇన్‌చార్జి కార్యదర్శులు అదనపు గ్రామాలకు వారానికోసారి లేదా పక్షానికోసారి మాత్రమే అందుబాటులో ఉండటంతో చిన్నచిన్న సమస్యల పరిష్కారానికే రోజులు, వారాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

పడకేసిన పారిశుధ్యం...

కార్యదర్శుల కొరతతో పాటు ముందస్తు ప్రణాళికల లోపం కారణంగా పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పలు గ్రామాల్లో వీధులు మురుగునీటితో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి. బ్లీచింగ్ పిచికారీ, చెత్త సేకరణ, వీధి లైట్ల నిర్వహణ వంటి పనులు సక్రమంగా జరగడం లేదని ప్రజలు చెబుతున్నారు. సీజనల్ వ్యాధుల ముప్పు దృష్ట్యా పారిశుధ్య చర్యలను మరింత పటిష్ఠంగా చేపట్టాలని వారు కోరుతున్నారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్, ఉపసర్పంచ్‌ల మధ్య సమన్వయ లోపం కారణంగా సమస్యలు మరింత పెరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సెక్రటరీల నిర్లక్ష్యం.. రాని తీర్మానాలు..

కొంతమంది కార్యదర్శులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో ఉన్న సమస్యలపై పంచాయతీ సమావేశాలు నిర్వహించి తీర్మానాలు నమోదు చేయడంలో జాప్యం జరుగుతోందని, దీంతో అనేక అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో పంచాయతీ పాలనలో పారదర్శకత దెబ్బతింటోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల అభివృద్ధికి సిద్ధంగా ఉన్న సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు కార్యదర్శుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదని వారు వాపోతున్నారు.

ప్రజల చూపంతా ఎంపీఓపైనే..

గతంలో పినపాక మండలంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించిన ఎంపీఓ వెంకటేశ్వరావు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రెండుసార్లు ఉత్తమ అవార్డులు అందుకున్నారు. ఇటీవల తిరిగి పినపాక మండల ఎంపీఓగా బాధ్యతలు స్వీకరించడంతో మండల ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. కార్యదర్శుల కొరత ఉన్నప్పటికీ పారిశుధ్యం, గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించి మండలాన్ని తిరిగి అభివృద్ధి బాటలో నడిపిస్తారనే ఆశాభావాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story