రేవంత్ రెడ్డి ఆ ఒక్క ఫెయిల్యూర్ చాలు.. తెలంగాణలో బీజేపీదే అధికారం: ఎంపీ అర్వింద్

by Prasad Jukanti |   (  Updated:2026-07-28 11:51:14  IST  )

జెన్ జీ గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి అదే జెన్ జీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి ఆ ఒక్క ఫెయిల్యూర్ చాలు.. తెలంగాణలో బీజేపీదే అధికారం: ఎంపీ అర్వింద్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒకసారి నీట్ పేపర్ లీకైనందుకు మా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేశారని మరి తెలంగాణలో ప్రతి ఏడాది 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్ రాక ఇబ్బందులు పడుతున్నారని అలాంటిది ఏ ముఖం పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. జెన్ జీల గురించి మాట్లాడుతున్న సీఎం ముందు తన వద్ద ఉన్న విద్యాశాఖను కాంగ్రెస్‍లో ఉన్న యువ ఎమ్మెల్యేలకు ఇవ్వాలని సూచించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది లేదు ఏమి లేదని అలాంటిది రేవంత్ రెడ్డి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరో నిర్ణయించే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి వైఖరి చూస్తే రాహుల్ గాంధీని సైడ్ చేసి ప్రధాని కావాలనే ఆలోచనతో ఉన్నారా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన అర్వింద్.. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి విద్యార్థుల జీవితాలతో చలగాటం అడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కాలేజీలు మూసేసే పరిస్థితి ఉందన్నారు.

లక్షల మందితో హైదరాబాద్‍లో ధర్నా ప్లాన్ చేయాలి

హైకోర్టు రంగనాథ్ చెంప చెల్లుమనిపిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాచిపోయిందని సెటైర్ వేశారు. రాష్ట్రంలోని జెన్ జీ పడుతున్న ఇబ్బందులు పడుతున్న అవేవి పట్టించుకోకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఫీజురీయింబర్స్ మెంట్ వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అందువల్ల తొందరలోనే లక్ష మంది విద్యార్థులతో హైదరాబాద్‍లో భారీ ధర్నాకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ఫీజు రీయింబర్స్ వైఫల్యం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రుల యావరేజ్ ఏజ్ 62 ఏళ్లు అని, కాంగ్రెస్ పార్టీ పూరాతనమైన పార్టీ అని వీళ్లు జెన్ జీ గురించి మాట్లాడతారా అని నిలదీశారు.

మాట్లాడుకునే రేవంత్, కేటీఆర్ ఢిల్లీ టూర్:

సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మాట్లాడుకునే ఒకే సారి ఢిల్లీ పర్యటనకు వచ్చారని అర్వింద్ ఆరోపించారు. ఈ-కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరంతో పాటు అనేక అంశాల్లో ఈ రెండు పార్టీలు కోఆర్డినేట్‌తోనే నడుస్తున్నాయన్నారు. రేవంత్ రెడ్డి తనకు మిత్రుడని సీఎం అయ్యాక అధికారమే లక్ష్యంగా, అవినీతే పరమావధిగా, కుటుంబ పాలననే తీసుకువచ్చారని ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకుని బీఆర్ఎస్ వెళ్లిపోతే ఆ దొంగలను దోచుకునేందుకు కోఆర్డినేషన్ తో ఢిల్లీకి ఇద్దరు వచ్చారన్నారు. సీబీఐ విచారణకు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా కాకుండా కేవలం మూడు బ్యారేజీలకు మాత్రమే ఎందుకు పరిమితం చేశారని నిలదీశారు.

యూరియాను బ్లాక్‌లో అమ్ముకొని కేంద్రంపై నెపం:

రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాక ఇతరులపై బురద జల్లే పని చేస్తున్నారని అర్వింద్ విమర్శించారు. రేవంత్ రెడ్డి యూరియాను బ్లాక్‌లో అమ్ముకొని, కొరత వచ్చిందని కేంద్రంపై నెడుతున్నాడని మండిపడ్డారు. తెలంగాణకు 2016-17లో 26.13 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇస్తే.. 2025-26లో 42.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్రం నుండి వచ్చిందని ఏప్రిల్ నుండి జూలై మధ్యలో DAPలో 28 షోకాజ్ నోటీసులు, 9 లైసెన్స్ క్యాన్సిలేషన్లు, 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయన్నారు. వీటిపై ఇన్వెస్టిగేషన్ చేస్తే అందరూ కాంగ్రెస్ వాళ్లే ఉన్నారని ధ్వజమెత్తారు.

Next Story