- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జంతర్‌మంతర్ వేదికగా రాహుల్ గాంధీ బూటకపు డ్రామాలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న నిరసనలు రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న బూటకపు కార్యక్రమాలేనని బీజేపీ జాతీయ నాయకుడు డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు.

దిశ, ఖమ్మం టౌన్ : ఢిల్లీలోని జంతర్‌మంతర్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న నిరసనలు రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న బూటకపు కార్యక్రమాలేనని బీజేపీ జాతీయ నాయకుడు, కర్ణాటక–తమిళనాడు రాష్ట్రాల ఇన్‌చార్జి డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియతో దొంగ ఓట్లు తొలగిపోతాయనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. మంగళవారం ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావుతో కలిసి పరిశీలించిన అనంతరం నగరంలోని రోటరీ నగర్ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
జంతర్‌మంతర్ వేదికగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న దీక్షలు, నిరసనలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా రాజకీయ ప్రచారం కోసమేనని ఆరోపించారు. ప్రజల మద్దతు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ కెమెరాల ముందు కనిపించేందుకు మాత్రమే ఆందోళనలను ఆశ్రయిస్తోందని, రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజలకు ఉపయోగపడే ప్రత్యామ్నాయ విధానాలు లేవని విమర్శించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తోందని పేర్కొన్న ఆయన, ఈ ప్రక్రియ ద్వారా నకిలీ, అక్రమ ఓటర్లు తొలగిపోతుండటంతో కాంగ్రెస్‌లో ఆందోళన నెలకొందన్నారు. నిజమైన ఓటర్ల హక్కులను పరిరక్షించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని, ఖమ్మం జిల్లాలో దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించిన పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలు అమలు కాకపోవడంతో ప్రజలు నిరాశకు గురయ్యారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి మందగించిందని, శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని, ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు, రాజకీయ కక్షసాధింపులకే పరిమితమైందని విమర్శించారు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలకు పాల్పడుతున్నారని, ప్రజా సమస్యల పరిష్కారం కంటే రాజకీయ లబ్ధిపైనే కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరించిందని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గోంగూర వెంకటేశ్వరరావు, రుద్ర ప్రదీప్, గుత్తా వెంకటేశ్వర్లు, నున్న రవికుమార్, శీలం పాపారావు, శాసనాల సాయిరాం, శ్యామ్ రాథోడ్, అనిత, రాజేష్, సరస్వతి, ఆర్వీఎస్ యాదవ్, ప్రతాప్, లక్ష్మీనారాయణ శ్రీనివాస్, తాజ్‌నూత్ భద్రం, గడీల నరేష్, నక్క రవి గౌడ్, వెంకటనారాయణ యాదవ్, వెంకట నరసయ్య, గుత్తా వంశీ తదితరులు పాల్గొన్నారు.






