మూడు నెలలుగా వేతనాలు లేవు.. ఫీల్డ్ అసిస్టెంట్ల ఆగ్రహం

by Batti.Sumithra |

ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు గత మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సంగారెడ్డి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.

మూడు నెలలుగా వేతనాలు లేవు.. ఫీల్డ్ అసిస్టెంట్ల ఆగ్రహం
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు గత మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సంగారెడ్డి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు పి.అశోక్ మాట్లాడుతూ ఉపాధి హామీలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లకు గత మూడు నెలలుగా వేతనాలు రావడం లేదని అన్నారు. వేతనాలు రాకపోతే వారు ఎలా జీవిస్తారని ప్రశ్నించారు.

పనిభారం రోజురోజుకు పెరుగుతుందని, కానీ వేతనాలు మాత్రం సకాలంలో ఇవ్వకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పథకం పేరు మార్చింది తప్ప వేతనాలు మాత్రం సకాలంలో ఇవ్వడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అందరూ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని చెబుతోందని, అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఫీల్డ్ అసిస్టెంట్లు కనిపించడం లేదా అని నిలదీశారు. వెంటనే మూడు నెలల బకాయి వేతనాలను చెల్లించాలని, అలాగే ప్రతి నెల మొదటి వారంలోనే వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభాకర్, విద్యాసాగర్, నాగభూషణం గౌడ్, దివాకర్, సునీత, అనిత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Next Story