వర్ష బీభత్సం.. చాదర్‌ఘాట్–మాలక్‌పేట్ అండర్‌పాస్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్

by Taduka Kalyani |

నగరంలో మంగళవారం కురిసిన ఎడతెరిపి లేని భారీ వర్షం సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది.

వర్ష బీభత్సం.. చాదర్‌ఘాట్–మాలక్‌పేట్ అండర్‌పాస్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్
X

దిశ,చంపాపేట్ జూలై 28: నగరంలో మంగళవారం కురిసిన ఎడతెరిపి లేని భారీ వర్షం సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ముఖ్యంగా చాదర్‌ఘాట్ నుంచి మాలక్‌పేట్ రైల్వే అండర్‌పాస్ వరకు రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అండర్‌పాస్ వద్ద నీరు చేరడంతో కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఆర్టీసీ బస్సులు నత్తనడకన సాగాయి. పలుచోట్ల వాహనాలు నిలిచిపోవడంతో కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్తున్న ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర పనులపై బయలుదేరిన ప్రజలు గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, వర్షపు నీరు వేగంగా వెళ్లే ఏర్పాట్లు లేకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. ప్రతి ఏడాది ఇదే దృశ్యం పునరావృత అవుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం చూపడంలో సంబంధిత శాఖలు విఫలమవుతున్నాయని విమర్శిస్తున్నారు. చాదర్‌ఘాట్–మాలక్‌పేట్ అండర్‌పాస్‌లో వర్షపు నీరు నిల్వ కాకుండా తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్థానికులు జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు, సంబంధిత అధికారులను కోరుతున్నారు.

Next Story