శిఖర్ ధావన్ - సోఫీ ధావన్ దంపతుల 'డిజిటల్' కానుక.. 2500 మంది విద్యార్థినులకు స్మార్ట్ విద్య

by Malleboina Mahesh |

క్రికెటర్ శిఖర్ ధావన్, ఆయన భార్య సోఫీ ధావన్ కలిసి ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు డిజిటల్ విద్యను చేరువ చేశారు. 'డిజిటల్ శిక్ష' ద్వారా 2500 మంది బాలికల భవిష్యత్తును మార్చే దిశగా అడుగులు వేశారు.

శిఖర్ ధావన్ - సోఫీ ధావన్ దంపతుల డిజిటల్ కానుక.. 2500 మంది విద్యార్థినులకు స్మార్ట్ విద్య
X

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ప్రత్యేక ఫౌండేషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన ఫౌండేషన్ కు విదేశీ నిధులు నేరుగా విరాళాలుగా వచ్చేందుకు కేంద్రం అనుమతించింది. తాజాగా శిఖర్ ధావన్ - సోఫీ ధావన్ దంపతుల ఈ ఫౌండేషన్ ద్వారా కీలక నిర్ణయం తీసుకున్నారు. ధావన్ ఆయన భార్య సోఫీ ధావన్ నేతృత్వంలోని ఎస్‌డీఎఫ్, ఢిల్లీలోని తుగ్లకాబాద్ విలేజ్‌లో ఉన్న సర్వోదయ కన్యా విద్యాలయలో 'డిజిటల్ శిక్ష' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇన్యువెన్ క్యాపిటల్ (InnoVen Capital) సీఎస్ఆర్ సహకారంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 2,500 మంది విద్యార్థినులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్య అందనుంది.

క్లాస్‌రూమ్‌లలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (IFPs), అత్యాధునిక డిజిటల్ కరిక్యులమ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా సైన్స్, మ్యాథ్స్, భాషలను దృశ్యరూపంలో సులభంగా అర్థం చేసుకునే సదుపాయం కలుగుతుంది. క్రికెటర్ శిఖర్ ధావన్ తన రెండో వివాహాన్ని ఐరిష్ ప్రొడక్ట్ కన్సల్టెంట్ అయిన సోఫీ షైన్ (ప్రస్తుతం సోఫీ ధావన్) తో ఫిబ్రవరి 2026 లో చేసుకున్నారు. సోఫీ ప్రస్తుతం శిఖర్ ధావన్ ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ, సామాజిక సేవలో కీలక పాత్ర పోషిస్తున్నారు. "వనరులు తక్కువగా ఉన్నా.. ఆశయాలు ఎక్కువగా ఉన్న విద్యార్థులకు డిజిటల్ విద్య ఎంతో మేలు చేస్తుంది" అని సోఫీ ధావన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ ఫౌండేషన్ 25కు పైగా పాఠశాలల్లో 20,000 మందికి పైగా విద్యార్థులకు డిజిటల్ విద్యను అందిస్తోంది.

Next Story