సంతోష్‌నగర్‌లో ఇంటింటికీ ఫారాల పంపిణీ.. క్షేత్రస్థాయిలో బీఎల్‌వోల పనితీరును పరిశీలించిన అధికారులు

by Jakkula.Mamatha |

ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్) కార్యక్రమం సంతోష్‌నగర్ డివిజన్‌లో వేగవంతంగా కొనసాగుతోంది.

సంతోష్‌నగర్‌లో ఇంటింటికీ ఫారాల పంపిణీ.. క్షేత్రస్థాయిలో బీఎల్‌వోల పనితీరును పరిశీలించిన అధికారులు
X

దిశ,చంపాపేట్: ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్) కార్యక్రమం సంతోష్‌నగర్ డివిజన్‌లో వేగవంతంగా కొనసాగుతోంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో రియాసత్‌నగర్ పరిధిలోని బూత్ నంబర్–46లో బూత్ లెవల్ అధికారులు(బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి ప్రత్యేక సవరణ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి బీఎల్‌వోల పనితీరును సమీక్షించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బూత్ నంబర్–46 పరిధిలో మొత్తం 903 మంది ఓటర్లు ఉండగా, వారిలో 710 మంది ఓటర్లకు ఇంటింటికీ వెళ్లి ప్రత్యేక సవరణ ఫారాలు అందజేశారు.

ఇప్పటివరకు పంపిణీ చేసిన ఫారాల్లో 350 నుంచి 400 వరకు తిరిగి స్వీకరించినట్లు వెల్లడించారు. మిగిలిన ఫారాలను కూడా త్వరితగతిన సేకరించి, నిర్దేశిత గడువులోపు సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని బీఎల్‌వోలకు సూచించారు. మిగిలిన ఓటర్లలో కొంతమంది మరణించినవారిగా, మరికొందరు ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా నివాసం మార్చుకున్న (షిఫ్టెడ్) వారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత ఆధారాలను నమోదు చేసి, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఓటరు జాబితా కచ్చితత్వమే స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలకు పునాది అని అన్నారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా, అలాగే అనర్హుల పేర్లు కొనసాగకుండా అత్యంత జాగ్రత్తగా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

ప్రజలు కూడా ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొని, తమకు అందిన ఫారాలను పూర్తిగా నింపి వెంటనే బీఎల్‌వోలకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఇంటికి చేరుకుని కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, చిరునామా మార్పులు, తొలగింపులు వంటి ప్రక్రియలను నిబంధనల మేరకు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ విజయవంతంగా పూర్తయితే రానున్న ఎన్నికల్లో ప్రతి అర్హ పౌరుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

Next Story