సీతారామ ‘సబ్ కెనాల్స్’ వద్దు

by Ratna Kumari |

సీతారామ ప్రాజెక్టు సబ్ కెనాల్స్ (పంట కాలువలు) పేరుతో తమ పచ్చని ఆయిల్ పామ్ తోటలను నాశనం చేయవద్దని దమ్మపేట మండలంలోని ఏడు గ్రామ పంచాయతీల నిర్వాసిత రైతులు ప్రభుత్వాన్ని కోరారు.

సీతారామ ‘సబ్ కెనాల్స్’ వద్దు
X

దిశ, దమ్మపేట : సీతారామ ప్రాజెక్టు సబ్ కెనాల్స్ (పంట కాలువలు) పేరుతో తమ పచ్చని ఆయిల్ పామ్ తోటలను నాశనం చేయవద్దని దమ్మపేట మండలంలోని ఏడు గ్రామ పంచాయతీల నిర్వాసిత రైతులు ప్రభుత్వాన్ని కోరారు. పట్వారిగూడెంలో సర్పంచ్ కూరం అర్జున్‌రావు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో రైతులు పలు తీర్మానాలు చేశారు. పంట కాలువలు తవ్వే బదులుగా ప్రధాన కాలువ ద్వారా స్థానిక చెరువులను నింపితే బోర్ల ఆధారంగా సాగు చేసుకుంటామని రైతులు స్పష్టం చేశారు.

కొత్త భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్..

2019లో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన సమయంలో రిజిస్ట్రేషన్ విలువ ఎకరాకు రూ.1.20 లక్షలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం అది రూ.4.75 లక్షలకు పెరిగిందని రైతులు తెలిపారు. ప్రస్తుత మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుని కొత్త భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసి ఎకరాకు రూ.40 లక్షలు, ప్రతి ఆయిల్ పామ్ చెట్టుకు రూ.1.50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 2019లో నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటివరకు పరిహారం చెల్లించలేదని, భూసేకరణ, పునరావాసం, పునరుద్ధరణకు సంబంధించిన 2013 చట్టం ప్రకారం ఇంతకాలం తర్వాత పాత నోటిఫికేషన్ ఆధారంగా భూసేకరణ చేపట్టడం సరికాదని పేర్కొన్నారు. జూలూరుపాడు, సత్తుపల్లి తదితర ప్రాంతాల్లో అధిక పరిహారం చెల్లించి తమ విషయంలో మాత్రం వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.

గ్రామసభల ఆమోదం లేకుండానే రికార్డులు సృష్టించారన్న ఆరోపణ..

గ్రామసభలు నిర్వహించకుండానే దొంగ సంతకాలతో సబ్ కెనాల్స్‌కు ఆమోదం తెలిపినట్లు అధికారులు రికార్డులు సృష్టించారని రైతులు ఆరోపించారు. ఈ విషయంపై ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయగా, జిల్లా కలెక్టర్‌కు నోటీసులు కూడా జారీ అయినట్లు తెలిపారు. పీసా చట్టం ప్రకారం గ్రామసభల ఆమోదం లేకుండా ఎలాంటి పనులు జరగనివ్వబోమని రైతులు స్పష్టం చేశారు. ఈ సమస్యను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని సమావేశంలో తీర్మానించారు.

Next Story