- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోల్కొండలో డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ నిర్వహణ..
అత్యంత వైభవంగా ప్రారంభమైన గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి బోనాల ఉత్సవాలను మునుపెన్నడూ లేని విధంగా డ్రోన్ల ద్వారా సిటీ ట్రాఫిక్ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.

దిశ, కార్వాన్: నగరంలో అత్యంత వైభవంగా ప్రారంభమైన గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి బోనాల ఉత్సవాలను మునుపెన్నడూ లేని విధంగా డ్రోన్ల ద్వారా సిటీ ట్రాఫిక్ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. బోనాల ఉత్సవాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో గోల్కొండ పరిసర ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారుల వెంట ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 16న ప్రారంభమైన బోనాల ఉత్సవాలకు సంబంధించిన ట్రాఫిక్ మళ్ళింపుల తో పాటు డ్రోన్ ల సహాయంతో తీసిన వాహనాల రాకపోకల ఫోటోలను విడుదల చేశారు. గోల్కొండ జోన్ ట్రాఫిక్ ఏసిపి డి ధనలక్ష్మి మంగళవారం ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు సుగమం చేయడానికి నగర ట్రాఫిక్ పోలీస్ శాఖ మొదటిసారిగా డ్రోన్ సర్వేలెన్స్ (డ్రోన్ల నిఘా) వ్యవస్థను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు.
వాహనాల రద్దీని అంచనా వేయడానికి..
డ్రోన్ ల సహాయంతో పార్కింగ్ స్థలాలు, ప్రధాన ట్రాఫిక్ మళ్లింపు పాయింట్లను ఎప్పటికప్పుడు ఆకాశ మార్గం ద్వారా పర్యవేక్షిస్తూ, ట్రాఫిక్ జామ్‌లను తక్షణమే నివారించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం జరుగుతుందని తెలిపారు. ముందస్తుగా ప్రకటించిన రూట్ డైవర్షన్ల ప్రకారం వాహనాలు సజావుగా సాగేలా అన్ని ప్రధాన మళ్లింపు పాయింట్లను డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించడంతో పాటు గోల్కొండ కోటకు సమీపంలో కేటాయించిన పార్కింగ్ స్థలాలలో వాహనాల రద్దీని అంచనా వేయడానికి, అనధికార పార్కింగ్‌ను నిరోధించడానికి మరియు భక్తులకు ఖాళీగా ఉన్న పార్కింగ్ స్థలాలను సూచించడానికి డ్రోన్‌లను ఉపయోగిస్తున్నామన్నారు. కోటకు వెళ్లే ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో సమకూరే ప్రాంతాలలో ట్రాఫిక్ ఆటంకాలను తక్షణమే గుర్తించి, వెంటనే క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా నియంత్రణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఆధునిక డ్రోన్ సాంకేతికత వినియోగం వల్ల క్షేత్రస్థాయి ట్రాఫిక్ పరిస్థితిపై సమగ్ర అవగాహన ఏర్పడి, బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తులకు, సాధారణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఎంతగానో తోడ్పడుతోందని తెలిపారు.






