గంభీరావుపేట ఎంపీడీవో కార్యాలయంలో తీవ్ర సిబ్బంది కొరత

by Ratna Kumari |

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో తీవ్ర సిబ్బంది కొరత నెలకొంది.

గంభీరావుపేట ఎంపీడీవో కార్యాలయంలో తీవ్ర సిబ్బంది కొరత
X

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో తీవ్ర సిబ్బంది కొరత నెలకొంది. కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో కార్యాలయ పరిపాలన మందగించి, ప్రజలకు సేవలందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం కార్యాలయంలో ఎంపీడీవో, ఎంపీవో, సీనియర్ అసిస్టెంట్, ఈ-పంచాయతీ ఆపరేటర్లు, ఇద్దరు సబార్డినేట్ సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. కీలకమైన సూపరింటెండెంట్ పదవిలో ఉన్న అధికారి జూన్ 30న పదవీ విరమణ చేయడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. అలాగే జూనియర్ అసిస్టెంట్ డిప్యూటేషన్‌పై మరో మండలానికి వెళ్లగా, టైపిస్ట్ పోస్టు చాలా కాలంగా ఖాళీగానే ఉంది. మండల అభివృద్ధి కార్యక్రమాల అమలు, పరిపాలనా వ్యవహారాలు, సంక్షేమ పథకాల నిర్వహణలో కీలక పాత్ర పోషించే కార్యాలయంలో సిబ్బంది కొరత కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వివిధ ప్రభుత్వ పథకాల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మండల అభివృద్ధిని వేగవంతం చేయాల్సిన కార్యాలయంలో కీలక పోస్టులు ఖాళీగా ఉండటంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఖాళీగా ఉన్న సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ తదితర పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఖాళీలను భర్తీ చేస్తేనే ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

Next Story