చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ ...రిమాండ్ కు తరలింపు

by Taduka Kalyani |

జిల్లాలో గత కొన్ని నెలలుగా రాత్రి వేళ తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ ...రిమాండ్ కు తరలింపు
X

దిశ, ఖమ్మం క్రైం :: జిల్లాలో గత కొన్ని నెలలుగా రాత్రి వేళ తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు. మంగళవారం సాయంత్రం నగరంలోని కిన్నెర హోటల్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న ఖమ్మం టూ టౌన్, సీసీఎస్ పోలీసులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆత్కూరు గ్రామానికి చెందిన సెంట్రింగ్ వర్కర్ కంబంపాటి ఏసోబు అలియాస్ కందుల సురేష్ రెడ్డి (45)ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడిపై గతంలో 22 చోరీ కేసులు నమోదై ఉండగా, పలుమార్లు జైలు శిక్ష కూడా అనుభవించినట్లు వెల్లడించారు. అతడి వద్ద నుంచి సుమారు రూ.32 లక్షల విలువైన 32 తులాల బంగారు ఆభరణాలు, రూ.40 వేల విలువైన వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది నుంచి ఖమ్మం టూ టౌన్‌లో నాలుగు, ఖానాపురం హవేలీలో మూడు, వేంసూరు, వీఎం బంజర, చిల్లకల్లు, తిరువూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కో చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో ఇన్‌స్పెక్టర్లు కరుణాకర్, బాలకృష్ణ, భానుప్రకాశ్, ఎస్‌ఐ రమేష్ పాల్గొన్నారు.

Next Story