ముంచుకొస్తున్న వర్షాకాలంలో తూముల మరమ్మతులా..?

by Ratna Kumari |   (  Updated:2026-07-01 13:04:49  IST  )

మక్తల్ పెద్ద చెరువు కట్ట ప్రధాన తూము మరమ్మతు పనులను మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి బుధవారం పరిశీలించి, వర్షాకాలంలో మరమ్మతులు చేపట్టడంపై ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు.

ముంచుకొస్తున్న వర్షాకాలంలో తూముల మరమ్మతులా..?
X

దిశ, మక్తల్: మక్తల్ పెద్ద చెరువు కట్ట ప్రధాన తూము మరమ్మతు పనులను మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి బుధవారం పరిశీలించి, వర్షాకాలంలో మరమ్మతులు చేపట్టడంపై ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టులు, చెరువులకు సంబంధించిన మరమ్మతు పనులను వేసవి కాలంలో పూర్తి చేయాల్సి ఉండగా, పెద్ద చెరువు తూములకు మరమ్మతులు అవసరమని తెలిసినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు.మక్తల్ పెద్ద చెరువు కింద సుమారు 500 ఎకరాల ఆయకట్టు సాగు ఉండటంతో పాటు, కఖానాపురం, కర్నే, చిట్యాల గ్రామాలకు చెందిన సుమారు 2 వేల ఎకరాల ఆయకట్టుకు కూడా ఈ చెరువు ద్వారా నీరు చేరుతుందని తెలిపారు.

మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి..

పెద్ద చెరువు అలుగు ద్వారా మూడు చెరువులు నిండే అవకాశం ఉండటంతో ఈ తూములు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాకాలంలో మరమ్మతులు చేపట్టడం వల్ల ఖరీఫ్ పంట సాగుపై అనిశ్చితి నెలకొంటోందని, దీనికి బాధ్యులు సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పందించి తూముల మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. సంగంబండ రిజర్వాయర్ నుంచి మక్తల్ పెద్ద చెరువును నింపితే, దాని ద్వారా మూడు గ్రామాల చెరువులకు కూడా సాగునీరు అందే అవకాశం ఉంటుందని, ఈ అంశాన్ని అధికారులు దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story