స్కూల్ పిల్లలా.. కోడి పిల్లలా..?

by Batti.Sumithra |

వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పిల్లల భద్రతను మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

స్కూల్ పిల్లలా.. కోడి పిల్లలా..?
X

దిశ, నర్సాపూర్ : వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పిల్లల భద్రతను మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పిల్లల రవాణా కోసం ట్రాన్స్‌పోర్ట్ ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, కోడి పిల్లలను కుక్కినట్లు చిన్న వాహనాల్లో అధిక సంఖ్యలో విద్యార్థులను తరలిస్తున్నారు. ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం టాటా సుమోలో ఒకరి మీద ఒకరిని కూర్చోబెట్టి, ఊపిరి కూడా సరిగా పీల్చుకోలేని పరిస్థితిలో వారిని పాఠశాలకు తీసుకెళ్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని శ్రీ వాత్సల్ గురుకుల పాఠశాల యాజమాన్యం విద్యార్థుల భద్రత పట్ల చూపుతున్న నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపించింది. బుధవారం సదరు పాఠశాలకు చెందిన టాటా సుమోలో సుమారు 20 మంది వరకు విద్యార్థులను, వాహనంలో స్థలం సరిపోకపోయినా ఇష్టానుసారంగా నింపి తరలించారు.

వాహనం ప్రయాణిస్తున్న సమయంలో డోర్ లాక్ తెరుచుకుంటే పరిస్థితి ఏమిటని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలోకి ఆ వాహనం రాగానే గ్రామస్తులు డ్రైవర్‌ను అడ్డుకొని ఇదేంటని నిలదీశారు. అయితే వారికి సమాధానం చెప్పకుండా డ్రైవర్ అక్కడి నుంచి టాటా సుమోతో వెళ్లిపోయాడు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు పాఠశాలకు ఎంత భద్రంగా వెళ్తున్నారనే విషయం పై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచించారు. డబ్బుల కోసం కక్కుర్తిపడుతున్న ఇలాంటి పాఠశాల యాజమాన్యాల పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీవో అధికారులు కూడా పాఠశాల వాహనాల పై తరచూ తనిఖీలు నిర్వహించి, ప్రమాదాల నుంచి విద్యార్థులను కాపాడాలని కోరారు. ఈ విషయం పై పాఠశాల సిబ్బందిని వివరణ కోరగా, ఈ ఒక్కరోజే టాటా సుమోను పంపించామని, రేపటి నుంచి బస్సులను పంపిస్తామని తెలిపారు.

Next Story