సరిపడా లేని గోదాములు.. ధాన్యం నిల్వకు తీవ్ర ఇబ్బందులు

by Jakkula.Mamatha |

రైస్ మిల్లులు అనేక సమస్యలతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

సరిపడా లేని గోదాములు.. ధాన్యం నిల్వకు తీవ్ర ఇబ్బందులు
X

దిశ, కేసముద్రం: రైస్ మిల్లులు అనేక సమస్యలతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. గోదాముల కొరత, కార్మికుల లభ్యత తగ్గడం, పెరుగుతున్న నిర్వహణ వ్యయాలు, విద్యుత్ చార్జీలు, బ్యాంకు రుణాల భారం మిల్లర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వ సంస్థల నుంచి మిల్లులకు చేరుతున్న ధాన్యాన్ని నిల్వ చేసేందుకు తగిన గోదాములు లేకపోవడంతో మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారు. గోదాముల కొరత కారణంగా ధాన్యాన్ని బహిరంగ ప్రదేశాల్లో నిల్వ చేయాల్సి వస్తుండటంతో, వర్షాలతో ధాన్యం నాణ్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కస్టమ్ మిల్లింగ్ రైస్​సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు మిల్లర్లు వాపోతున్నారు.

కార్మికుల కొరత మరో ప్రధాన సమస్యగా మారింది. గ్రామీణ ప్రాంతాల నుంచి ఇతర రంగాలకు వలసలు పెరగడంతో కార్మికులు అందుబాటులో లేకపోవడం, ఉన్న కార్మికులకు అధిక వేతనాలు చెల్లించాల్సి రావడంతో ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. బ్యాంకు రుణ భారం మిల్లుల ఆర్థిక పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయని, కస్టమ్ మిల్లింగ్ ఒప్పందాల ప్రకారం నిర్దేశిత గడువులో బియ్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేయాల్సి ఉండటంతో, నిల్వ, కార్మిక సమస్యలు మిల్లర్లపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే అదనపు గోదాముల నిర్మాణం చేపట్టాలని, కార్మిక సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, కస్టమ్ మిల్లింగ్ రైస్ మిల్లులకు ప్రోత్సాహకాలు, ఆర్థిక సాయం అందించాలని మిల్లర్లు విజ్ఞప్తి చేస్తున్నాయి.

కష్టంగా మారిన ధాన్యం నిల్వ..

కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ధాన్యం నిర్వహణలో సరిపడా గోదాములు లేకపోవడం ఇబ్బందులను కలిగిస్తోంది. పంట సీజన్‌లో అధిక మొత్తంలో ధాన్యం మిల్లులకు చేరడంతో సమస్య తీవ్రంగా మారుతుంది. నిల్వ చేసేందుకు సరిపడా గోదాములు లేకపోవడంతో తాత్కాలిక ప్రదేశాల్లో నిల్వ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో వర్షాలు, తేమ, పురుగుల ప్రభావంతో ధాన్యం నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మిల్లర్లకు ఈ సమస్యలు ఆర్థికంగా భారంగా మారుతాయి. సమయానికి సీఎంఆర్ సరఫరా చేయలేకపోతే ఒప్పందాల అమలులో ఇబ్బందులు ఏర్పడతాయి.

సరిపడా గోదాములు లేవు..

ధాన్యం నిల్వచేసేందుకు సరిపడా గోదాములు లేవు. గుమస్తాలకు కూడా సమస్యలు ఎదురవుతాయి. నిల్వలో ఉన్న ధాన్యం లెక్కలు ఖచ్చితంగా నమోదు చేయడం కష్టతరమవుతుంది. బస్తాలు వివిధ ప్రదేశాల్లో చెల్లాచెదురుగా ఉండటంతో స్టాక్ లెక్కల్లో తేడాలు వస్తాయి. అధికారుల తనిఖీల సమయంలో సరైన సమాచారం అందించడానికి ఎక్కువ సమయం పడుతుంది.–శ్రామికుడు లెక్కల దేవేందర్ రెడ్డి

Next Story