- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏజెన్సీ చట్టాలకు పాతర.. మాంటిస్సోరీ పై ప్రజావాణిలో ఫిర్యాదు
గిరిజన ప్రాంతాల రక్షణ కోసం ఉద్దేశించిన ఏజెన్సీ చట్టాలను, విద్యాశాఖ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతూ టేకులపల్లి మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ మాంటిస్సోరీ పాఠశాల వైఖరి పై సేవాలాల్ సేన జిల్లా కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, టేకులపల్లి : గిరిజన ప్రాంతాల రక్షణ కోసం ఉద్దేశించిన ఏజెన్సీ చట్టాలను, విద్యాశాఖ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతూ టేకులపల్లి మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ మాంటిస్సోరీ పాఠశాల వైఖరి పై సేవాలాల్ సేన జిల్లా కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ)కి సేవాలాల్ సేన జిల్లా కార్యదర్శి బాదావత్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సేవాలాల్ సేన ప్రతినిధులు మాట్లాడుతూ గిరిజనేతర యజమాని ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పాఠశాలకు కేవలం జిల్లా విద్యాశాఖ అధికారి ( డీఈవో ) నుండి మాత్రమే అనుమతి ఉందని, మిగిలిన ఏ ఒక్క ప్రభుత్వ శాఖ నుండి కూడా చట్టబద్ధమైన పర్మిషన్లు లేవని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలలను దెబ్బతీసేలా, స్థానిక టేకులపల్లి యూపీఎస్ ( యుపీఎస్ ) పాఠశాలకు కేవలం 200 మీటర్ల దూరంలోనే ఈ ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు చేయడం అధికారుల బేఖాతరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. విద్యార్థులకు కనీస ఆటస్థలం కూడా లేని ఈ పాఠశాలకు అధికారులు ఎలా అనుమతులు మంజూరు చేశారని ప్రశ్నించారు. చట్టాలను పక్కనబెట్టి, నిరుపేద తల్లిదండ్రుల నుండి ఫీజుల రూపంలో భారీగా దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు భూములు లీజుకు తీసుకోవడం లేదా వ్యాపారాలు చేయడం పై ఉన్న చట్టపరమైన 1/70 అనుమతులు ఈ పాఠశాలకు లేవు కనీస ఆటస్థలం లేదు.
ప్రభుత్వ పాఠశాలకు 200 మీటర్ల లోపే నిర్మిస్తూ విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘించారు. ప్రమాదాలు జరిగితే పిల్లల రక్షణ కోసం ఉండాల్సిన ఫైర్ డిపార్ట్‌మెంట్ ఎన్ఓసీ కానీ, భవన దృఢత్వానికి సంబంధించిన ఆర్ &బీ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కానీ లేవు. గ్రామ పంచాయతీ ఎన్ఓసీతో పాటు, పాఠశాలలో తాగునీరు, పరిశుభ్రత పై శానిటేషన్ & హెల్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఈ కనీస అనుమతులు, సౌకర్యాలు ఏవీ లేకుండా, కేవలం విద్యాశాఖ లూప్‌హోల్స్‌తో ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ పాఠశాల నడపడం గిరిజన హక్కులను అవమానించడమేనని నేతలు మండిపడ్డారు. విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటూ, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ మాంటిస్సోరీ విద్యాసంస్థ పై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఉన్నత స్థాయి విచారణ జరపాలని, నిబంధనల ప్రకారం స్కూల్‌ను సీజ్ చేయాలని జేసీని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో గిరిజన సంఘాలను, తల్లిదండ్రులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన టేకులపల్లి మండల అధ్యక్షులు భానోత్ కిషన్ నాయక్, నాయకులు పవన్ కళ్యాణ్ నాయక్, నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.






