- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేమే కలాన్ @ రూ.20 కోట్లు
ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని తాడ్వాయి మండలం దేమే కలాన్ గ్రామంలో రూ.20 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రెండు వరుసల పీడబ్ల్యూడీ రహదారి నిర్మాణ పనులకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ ఘనంగా శంకుస్థాపన చేశారు.

దిశ, తాడ్వాయి : ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని తాడ్వాయి మండలం దేమే కలాన్ గ్రామంలో రూ.20 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రెండు వరుసల పీడబ్ల్యూడీ రహదారి నిర్మాణ పనులకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. దశాబ్దాలుగా నలుగుతున్న రోడ్డు సమస్యకు పరిష్కారం లభించడంతో గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌మోహన్ మాట్లాడుతూ ఈ రహదారి నిర్మాణం పూర్తయితే తాడ్వాయి, సదాశివనగర్, గాంధారి మండలాల ప్రజల ప్రయాణ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. నిజాంసాగర్ రహదారి నుంచి గాంధారి వరకు ఈ రెండు వరుసలతో రహదారిని చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ మూడు మండలాలను అనుసంధానించే ఈ రెండు వరుసల రహదారి ప్రాంతీయ అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం చేశామని, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, తాగునీటి సమస్యల పరిష్కారం, నూతన జీపీ భవనాల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త రేషన్ కార్డుల మంజూరు, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదలకు సొంతింటి కల నిజం చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అనేక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తై గృహప్రవేశాలు కూడా జరుగుతున్నాయని గుర్తు చేశారు. దేమే గ్రామానికి ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేరుస్తానని, అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
అనంతరం ప్రభుత్వ పాఠశాల బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ కన్కల్ ప్రభుత్వ పాఠశాలను శనివారం ప్రత్యేకంగా సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. అనంతరం పాఠశాల ఆవరణను, తరగతి గదులను పరిశీలించిన ఆయన విద్యార్థులకు సరిపడా వసతులు, మౌలిక సదుపాయాల పై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సుదీర్ఘంగా ఆరా తీశారు. తాగునీరు, మరుగుదొడ్లు, బెంచీలు, డిజిటల్ క్లాస్‌రూమ్‌ల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ పై ప్రజల్లో నమ్మకం పెంచేలా కృషి చేసిన గ్రామ సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డిని, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా కన్కల్ ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడం అభినందనీయమని కొనియాడారు. నియోజకవర్గంలోని మిగతా గ్రామాలకు కన్కల్ ఆదర్శంగా నిలిచిందన్నారు. పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, అవసరమైన నిధులు మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండారి సంజీవులు, ఉపాధ్యక్షులు, దేమే గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ శ్రేణులు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






