ఉర్దూలోనూ ఎస్ఐఅర్ ఓటరు ఫారాలు ఇవ్వండి

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్ఐఅర్ 2026 ఫారాలను ఉర్దూలోనూ అందించే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

ఉర్దూలోనూ ఎస్ఐఅర్ ఓటరు ఫారాలు ఇవ్వండి
X
  • హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
  • వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకి ఆదేశం
  • విచారణను వారం రోజులు వాయిదా..

దిశ,తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్ఐఅర్ 2026 ఫారాలను ఉర్దూలోనూ అందించే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఉర్దూ మాట్లాడే జనాభా 20 శాతానికి పైగా ఉన్న ప్రాంతాల్లో ఆ భాషలో ఓటరు నమోదు, సవరణ ఫారాలను ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని ప్రశ్నించింది. హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఓటరు ఫారాలను కేవలం తెలుగులోనే ముద్రించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు కోర్టు నిరాకరించింది. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, బిహార్ తదితర రాష్ట్రాల్లో ఈ ఫారాలను ఏయే భాషల్లో ముద్రిస్తున్నారో వివరాలు సమర్పించడంతో పాటు, పిటిషనర్ అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.ఎన్నికల సంఘం ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 వరకు ఓటర్ల నమోదు ప్రక్రియను చేపట్టనుంది. అయితే ఈ ఎస్ఐఅర్ ఫారాలను కేవలం తెలుగు భాషలో మాత్రమే ముద్రించి పంపిణీ చేయడం ఓటర్ల నమోదు రాజ్యాంగానికి విరుద్ధమంటూ కరీంనగర్‌కు చెందిన ఎం.ఏ. ముజీబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు.

మైనారిటీల ఓట్లు తొలగించే కుట్ర..

పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపిస్తూ.. ఓటరు ఫారాలను ఆంగ్లం, తెలుగు భాషల్లో మాత్రమే ముద్రించడం వెనుక మైనారిటీ ఓటర్లను తొలగించాలనే కుట్ర దాగి ఉందన్నారు. స్థానికులకు తెలిసిన భాషలో ఫారం కోరడం వారి రాజ్యాంగ హక్కని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఉండే బూత్ లెవల్ అధికారులకు బీఎల్‌ఓ ఏ భాష వచ్చో, ఏ భాష రాదో తెలియదని.. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉర్దూ తెలిసిన వారు ఎక్కువగా ఉన్నారని, వారికోసం ఉర్దూ పత్రాల అవసరం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పిటిషనర్ ఇచ్చిన వినతి పత్రాలను అధికారులు పట్టించుకోకపోవడం చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరారు.

రాజకీయ పార్టీల అంగీకారంతోనే..

ఈసీ ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ఓటరు ఫారాల ముద్రణపై ఈ నెల 17న జరిగిన సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా సమ్మతించాయన్నారు. తెలంగాణలో ప్రథమ భాష తెలుగు కావడంతో పాటు, మెట్రోపాలిటన్ నగరం కాబట్టి హైదరాబాద్‌లో అదనంగా ఆంగ్లంలో ఫారాలు ఇస్తున్నామని చెప్పారు. దేశంలో అన్ని భాషల వారు తెలంగాణలో ఉన్నారని, అందరికీ వారి భాషల్లో ఫారాలు ముద్రించాలంటే వేల కోట్ల ప్రజాధనం ఖర్చవుతుందన్నారు. ఒకే ఫారంలో రెండు మూడు భాషలు ఇస్తే ప్రజలు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. అయితే, బీఎల్‌ఓల వద్ద తెలుగుతో పాటు ఆంగ్లం, ఉర్దూ భాషల్లోని డమ్మీ ఫారాలు అందుబాటులో ఉంటాయని ఈసీ తరపు న్యాయవాది తెలిపారు. ఎవరికైనా తెలుగు రాకపోతే ఆ డమ్మీ ఫారాలు చూపించి, వారు చెప్పే వివరాలను బీఎల్‌ఓలు ఒకటికి రెండుసార్లు చదివి వినిపించి అసలు ఫారంలో నమోదు చేస్తారని వివరించారు. దీనికితోడు ఆన్‌లైన్‌లో అన్ని భాషల్లోనూ ఫారాలు అందుబాటులో ఉన్నాయని న్యాయమూర్తికి నివేదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఇతర రాష్ట్రాల విధానాలపై వివరాలు సమర్పించాలని ఈసీని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.

Next Story