జన్వాడ దంపతుల ఆత్మహత్య కేసు ఛేదించిన మోకిలా పోలీసులు

by Ratna Kumari |   (  Updated:2026-06-29 16:38:01  IST  )

శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామంలో దంపతుల ఆత్మహత్య కేసును మోకిలా పోలీసులు 24 గంటల్లో ఛేదించారు.

జన్వాడ దంపతుల ఆత్మహత్య కేసు ఛేదించిన మోకిలా పోలీసులు
X

దిశ, శంకర్‌పల్లి : శంకర్‌పల్లి మండలం జన్వాడ గ్రామంలో దంపతుల ఆత్మహత్య కేసును మోకిలా పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. మృతుడు బాలసాయి చారి సోదరుడు అరవింద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతుడి అత్త, మామ, తోటి అల్లుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మోకిలా ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జూలకల్ గ్రామానికి చెందిన పద్మ (25), జన్వాడ గ్రామానికి చెందిన బాలసాయి చారి (32) ప్రేమ వివాహం చేసుకుని సుమారు ఏడాదిన్నరగా దాంపత్య జీవితం కొనసాగిస్తున్నారు. బతుకుదెరువు కోసం పటాన్‌చెరు మండలం పటేల్‌గూడలో అద్దె ఇంట్లో నివసిస్తూ, బాలసాయి చారి ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాలుగు నెలల క్రితం జూలకల్ గ్రామానికి వచ్చిన ఓ వ్యక్తి, వారి ఇంట్లో నిధి ఉందని, తవ్వకాలు చేపడితే ధనవంతులు అవుతారని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పద్మ తల్లిదండ్రులు శాంతమ్మ, చంద్రయ్య తమ కుమార్తె, అల్లుళ్లతో ఈ విషయాన్ని పంచుకుని డబ్బులు సమకూర్చాలని కోరినట్లు విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో బాలసాయి చారి తనకు తెలిసిన వ్యక్తుల వద్ద నుంచి సుమారు రూ.10 లక్షలు అప్పుగా తీసుకుని ఇచ్చినట్లు మృతుడి సోదరుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తవ్వకాలు చేపట్టినప్పటికీ ఎలాంటి నిధి లభించలేదని పోలీసులు తెలిపారు. అనంతరం అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి రావడంతో బాలసాయి చారి తన అత్తమామలను పలుమార్లు కోరినప్పటికీ, వారు డబ్బులు తిరిగి ఇవ్వలేదని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాలసాయి చారి, అతని భార్య పద్మ ఇటీవల జన్వాడలోని స్వగ్రామానికి వచ్చి ఉంటుండగా, ఆదివారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి సోదరుడు అరవింద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, శాంతమ్మ, చంద్రయ్య, వెంకటేష్‌లను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనతో ఐదు నెలల చిన్నారి తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారింది. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story