- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెచ్‌సీఏకు మాజీ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అరుణ్ మిశ్రా నోటీసులు
భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, బీసీసీఐ ఒంబుడ్స్‌మన్ & ఎథిక్స్ ఆఫీసర్ జస్టిస్ అరుణ్ మిశ్రా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు అధికారిక నోటీసులు జారీ చేశారు.

దిశ, సికింద్రాబాద్ : భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, బీసీసీఐ ఒంబుడ్స్‌మన్ & ఎథిక్స్ ఆఫీసర్ జస్టిస్ అరుణ్ మిశ్రా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు అధికారిక నోటీసులు జారీ చేశారు. మాజీ క్రికెటర్ గౌరవ్ శర్మ తదితరులు దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన జస్టిస్ అరుణ్ మిశ్రా, బీసీసీఐ రాజ్యాంగ ఉల్లంఘనలు, సుప్రీంకోర్టు ఆమోదించిన పాలనా సంస్కరణల అమలుకు సంబంధించిన ఆరోపణలపై నాలుగు వారాల్లో సమగ్ర వివరణ ఇవ్వాలని హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌ను ఆదేశించారు. ఫిర్యాదులో హెచ్‌సీఏ సభ్యత్వ వ్యవస్థ, పూర్తి సభ్యుల భౌగోళిక పరిధి, కొత్త రాష్ట్రాల గుర్తింపు, వార్షిక ఆడిట్‌లు, ఆర్థిక నివేదికల సమర్పణ, కార్యవర్గ వివరాల నిర్వహణ తదితర అంశాల్లో బీసీసీఐ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించారు. అలాగే, బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం అసోసియేట్ సభ్యులుగా మాత్రమే ఉండాల్సిన సంస్థాగత సభ్యులకు పూర్తి సభ్యత్వం కల్పించడం వంటి అంశాలను కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ పరిణామంపై స్పందించిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి మాట్లాడుతూ, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నోటీసులు జారీ చేయడం ద్వారా ఆరోపణలు తీవ్రమైనవేనని స్పష్టమైందన్నారు. ఇకపై హెచ్‌సీఏ మీడియా ప్రకటనలు కాకుండా చట్టబద్ధమైన సమాధానాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. తెలంగాణ జిల్లా క్రికెటర్ల హక్కులు, పారదర్శక పరిపాలన, సమాన అవకాశాల కోసం టీసీఏ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. బీసీసీఐ రాజ్యాంగాన్ని గౌరవించడం ప్రతి సంస్థ బాధ్యత అని, చట్టపరమైన ప్రక్రియలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.






